జెడ్పీ పీఠం జనరల్..
Published Sun, Mar 9 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
సాక్షి, కాకినాడ :‘జిల్లా పరిషత్’ చైర్మన్ పీఠం జనరల్ కేటగిరీలోకి మారింది. సుదీర్ఘచరిత్ర కలిగిన జిల్లా పరిషత్ పీఠానికి ఈసారి ఏ వర్గానికి చెందిన వారైనా ఎన్నిక కాగల అవకాశం ఉంది. మినీ అసెంబ్లీగా పేరున్న జెడ్పీ పీఠాన్ని జనరల్ చేయడంతో.. దాన్ని అధిరోహించాలని ఉబలాటపడే నాన్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన ఆశావహులైన రాజకీయ నాయకులు అరుదైన అవకాశం తలుపు తడుతున్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. 2006 నుంచి అమలు చేస్తున్న రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్ల ఖరారు జరిగింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ పీఠం దశాబ్దం తర్వాత జనరల్ కేటగిరీకి కేటాయించారు. అదే విధంగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పరిషత్ సీఈఓ మజ్జి సూర్యభగవాన్ విలేకరులకు తెలిపా రు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ పీఠాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. మరొకపక్క వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీ టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణ లు మొదలు పెట్టారు.ఇదీ జిల్లా పరిషత్ చరిత్ర..
1917లో ఆవిర్భవించిన జిల్లా బోర్డు 1959లో జిల్లా పరిషత్‌గా రూపాంతరం చెందింది. 1987లో జిల్లా ప్రజాపరిషత్‌గా రూపు మార్చుకున్నప్పటికీ 1995లో మళ్లీ జిల్లా పరిషత్‌గా మారింది. జిల్లా బోర్డుకు పదిమంది చైర్మన్లుగా పనిచేయగా, జిల్లా ప్రజాపరిషత్‌కు ఇద్దరు, జిల్లా పరిషత్‌కు ఎనిమిది మంది చైర్మన్లుగా సేవలందించారు. వివిధ సందర్భాల్లో సుమారు ఏడేళ్ల పాటు స్పెషలాఫీసర్లు జిల్లా ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ పాలకపగ్గాలు చేపట్టారు. కాగా 1917లో ఏర్పడిన తొలి జిల్లా బోర్డు చైర్మన్ పదవిని దివాన్ బహద్దూర్ దురుశేటి శేషగిరిరావు పంతులు(1917-1923) చేపట్టగా, తర్వాత వరుసగా రావుబహద్దూర్ మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు (1923-1926), రావుబహద్దూర్ పోకల గోవిందరావు నాయుడు (1926-1929) ఆ పదవులను నిర్వహించారు. కేంద్ర మానవవనరుల శాఖమంత్రి ఎంఎం పళ్లంరాజు తాతగారైన దివంగత మల్లిపూడి పళ్లంరాజు స్వాతంత్య్రానికి పూర్వం మూడు దఫాలు (1929-32), (1939-40), (1941-42) జిల్లా బోర్డును ఏలారు.
రాజా కాకర్లపూడి రాజగోపాలనర్శరాజు బహద్దూర్(1933-1936), మెండు వీరన్న (1937-38), జబ్‌దాతు అక్రాన్ శ్రీబులుసు బుచ్చి సర్వారాయుడు (1943-46), మారిన నరసన్న(1949-53) జిల్లా బోర్డు చైర్మన్లుగా సేవలందించారు. ఇక 1959లో జిల్లా పరిషత్‌గా ఏర్పడిన తర్వాత తొలి చైర్మన్‌గా తోట రామస్వామి(1959-64) ఏలుబడి సాగించారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మాజీ మంత్రి ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు(1964-76), మాజీ మంత్రి పంతం పద్మనాభం (1981-83), ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు (1983-1986) జెడ్పీ పగ్గాలు చేపట్టారు. 1987లో ఏర్పడిన జిల్లా ప్రజా పరిషత్ పీఠాన్ని వరుసగా లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి (1987-1991), గారపాటి గంగాధర రామారావు చౌదరి(1991-92) చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్ అధికారులు రణదీప్ సుధాన్(1992-93), రాజీవ్‌శర్మ(1993-94), రాజీవ్ రంజన్ మిశ్రా (1994), సమీర్ శర్మ(1994-95) ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. తిరిగి 1995లో జిల్లా పరిషత్‌గా మారాక వంగా గీతా విశ్వనాథ్ (1995-2000), గుత్తుల బులిరాజు (నెలరోజులు) పని చేశారు. ఆ తర్వాత మళ్లీ సతీష్ చంద్ర రెండు నెలల పాటు ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. అనంతరం దున్నా జనార్దనరావు (2001-2006), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (2006-2011) చైర్మన్లుగా పనిచేశారు. ఆ తర్వాత ఎం.రవిచంద్ర (2011-12) ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం జిల్లాకలెక్టర్ నీతూప్రసాద్ 2012 మార్చి 7 నుంచి ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Advertisement