ముహూర్తం ఖరారు.. ఇక పల్లె పోరు
ముహూర్తం ఖరారు.. ఇక పల్లె పోరు
Published Tue, Mar 11 2014 2:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
* మోగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా
*గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి
*అభ్యర్థుల ఎంపిక కసరత్తులో పార్టీలు
*మద్దతుదారుల సమీకరణలో గ్రామ నాయకులు
*ఈవీఎంల మధ్య బ్యాలెట్ పేపర్ల గందరగోళం
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఇంతవరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఎన్నికల పోరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ముహూర్తం ఖరారు కావడంతో ఇప్పుడు పల్లెసీమలకు విస్తరించనుంది. దీంతో ప్రశాంతమైన గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకోనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6వ తేదీన జిల్లాలోని 38 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల నిర్వాకమే కారణమని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో అటు పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా కోర్టు తీర్పు దృష్ట్యా అనివార్యంగా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసి దాదాపు మూడేళ్లవుతున్నా రకరకాల సాకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రత్యేక అధికారుల పాలనతో పబ్బం గడుపుకుంది. చివరికి కోర్టు మందలించడంతో సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ ఎన్నికల నిర్వహించక తప్పలేదు.
పల్లెల్లో సందడి
రాజకీయ నాయకత్వం లేక గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న పల్లెలు ఒక్కసారి వచ్చిపడిన ఎన్నికలతో సందడి సంతరించుకుంటున్నాయి. గత జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగినా, ఆ తర్వాత తుఫాన్లు, భారీ వర్షాలతో పంటలు పోయి గ్రామీణులు రాజకీయాలు మరచిపోయారు. ఈ తరుణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో గ్రామ రాజకీయాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు మద్దతుదారులు, సానుభూతిపరుల సమీకరణలో, బలాబలాల లెక్కల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలకూ శ్రీకారం చుట్టారు.
గందరగోళంలో ఓటర్లు
రెండు నెలల వ్యవధిలో ఐదుసార్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రామీణ ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశముంది. మున్సిపల్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తుండగా వాటిలో మధ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాలెట్ బాక్సులు, పేపర్లు వినియోగిస్తారు. ఇది పల్లె ఓటర్లను ఇబ్బందికి గురి చేసే వ్యవహారమే. ఓటర్లు గందరగోళానికి గురైతే చెల్లని ఓట్లు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గత మూడేళ్లుగా కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు అందక గ్రామాల్లో అభివృద్ది పడకేసింది. ప్రజల నుంచి రాబట్టే వారే తప్ప, సౌకర్యాలు కల్పించే వారే లేకుండా పోయారు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజల కష్టాలపై ప్రశ్నించే వారు కూడా లేకుండా పోయారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అభ్యర్థులపై స్పష్టత లేకపోయినా ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఆయా ప్రాంతాల ఓటర్లకు చూచాయగా తెలిసిన విషయమే. దీంతో ఎవరి మద్దతుదారుల వెనుక వారు చేరిపోతున్నారు.
జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ
జిల్లాలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ ఇచ్చారు. శిక్షకులను ఉద్దేశించి ఏజేసీ మహమ్మద్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. సామగ్రి పంపిణీ చేసే విధానాన్ని సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు తక్షణం శిక్షణ ఇవ్వాలని సూచించారు. విశ్రాంత అధికారులు బలివాడ మల్లేశ్వరరావు, సత్యనారాయణలు ఈ శిక్షణ ఇచ్చారు.
జిల్లాలో పరిషత్
ఎన్నికల స్వరూపం
జెడ్పీటీసీలు-38
ఎంపీటీసీలు
నామినేషన్ల-675
స్వీకరణ..15 నుంచి
తుది గడువు-20
పరిశీలన-21
ఉపసంహరణ గడువు-24
పోలింగ్-ఏప్రిల్ 6
రీపోలింగ్-ఏప్రిల్ 7
ఓట్ల లెక్కింపు -ఏప్రిల్ 8
Advertisement
Advertisement