April 6
-
తొలి పోరు నేడు
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా బ్బిలి,కురుపాం,పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పార్వతీపురం డివిజన్లోని 15 మండలాల్లో 767 కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్, సమస్యాత్మక గ్రామాల్లో సూక్ష్మ పరిశీలకుల ద్వారా ఎన్నికల పక్రియను అధికారులు పరిశీలించనున్నారు. పోలింగ్ సిబ్బంది వివరాలు: పోలింగ్ ప్రక్రియలో 843 మంది పీఓలు, 843 మంది ఏపీఓలు, 3374 మంది ఓపీఓలు పాల్గొంటారు. ఎంపీటీసీలకు సంబంధించి 6,33,000 బ్యాలెట్ పత్రాలు, జెడ్పీటీసీలకు 6,39,400 బ్యాలెట్ పత్రాలు వినియోగించనున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్, ఎంపీటీసీల ఎన్నికకు ఎరుపు రంగు బ్యాలెట్ వినియోగించనున్నారు. 30 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ : 30 అతి సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. 111 సమస్యాత్మక గ్రామాల్లో సూక్ష్మపరిశీలకులను, 80 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు : 5,79,755 పురుషులు : 2,86,194 మహిళలు : 2,93,556 ఇతరులు : ఐదుగురు ఎంపీటీసీ స్థానాలు : 225 బరిలో ఉన్న అభ్యర్థులు : 605 జెడ్పీటీసీ స్థానాలు : 15 బరిలో ఉన్న అభ్యర్థులు : 54 -
తొలివిడత ‘ప్రాదేశిక’పోరు నేడే
సాక్షి, కాకినాడ :జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. 26 జెడ్పీటీసీలలో 111 మంది, 513 ఎంపీటీసీలలో 1321 మంది తలపడుతున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే 12,81, 692 మంది ఓటర్లలో 6,38,194 మంది పురుషులు కాగా, 6,43,498 మంది మహిళలు. 1,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 8,498 మంది సిబ్బందిని నియ మించారు. 2,907 మందికి పైగా పోలీసులను, ప్రత్యేక దళాలను మోహరించారు. ఓటుకు రూ.1000 వరకు పంపిణీ.. బరిలో ఎంతమంది ఉన్నా ప్రధానపోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్యే. గత రెండు వారాలుగా నువ్వా, నేనా అన్నట్టు ప్రచారహోరు సాగింది. అయినా ‘ఫ్యాన్’ గాలి ముందు ‘సైకిల్’ బేజారు కాక తప్పదని టీడీపీ నేతలు నిస్పృహ చెందుతున్నారు. పార్టీ స్థానిక, జిల్లా నేతలు వ్యవహరించిన తీరు కూడా తమ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు శనివారం ఒక్కరోజే తెలుగుతమ్ముళ్లు కోట్లు కుమ్మరించారు.ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు డబ్బులు, చీరలు, సారెలు, నిత్యావసరాలు, కొన్ని చోట్ల వెండిరూపులు పంచారు. ఇక మద్యం, నాటుసారా ఏరులై పారించారు. జనమే వైఎస్సార్ సీపీ బలం కాగా ప్రజాబలంతో ఎన్నికలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీకి గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను మెరుగు పర్చింది. పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా జ్యోతుల నవీన్‌కుమార్ పేరు ఖరారుతో పాటు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో సాగించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఆ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు కలిసొచ్చింది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగే 26 స్థానాల్లో 20కు పైగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ కావడం ఖాయమంటున్నారు. మరో ఆరుచోట్ల పోరు హోరాహోరీగా ఉంటుందని అంచనా. -
ఇక సమరమే..
12న పోలింగ్ కేంద్రాల గుర్తింపు 13న జాబితా తయారు 14న అభ్యంతరాల స్వీకరణ 15న పార్టీలతో సమావేశం 16న కేంద్రాల జాబితా జిల్లా కలెక్టర్‌కు సమర్పణ 18న తుది జాబితా ప్రచురణ నల్లగొండ, న్యూస్‌లైన్ :ప్రాదేశిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలతో జిల్లా యంత్రాంగం సతమతమవుతుంటే తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడం రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ప్రకటించడంతోనే గ్రామాల్లో రాజకీయ కోలాహలం మొదలైంది. సోమవారం వివిధ మండలాల్లో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించాయి. అభ్యర్థుల ఎంపిక , పొత్తులకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల్లో వాడివేడిగా చర్చలు చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు 835, జెడ్పీటీసీ 59 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం 17న షెడ్యూల్ జారీ చేయనుంది. షెడ్యూల్ జారీ అయిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలై ఏప్రిల్ 8న ఎన్నికల ఫలితాలతో ముగుస్తుంది. ప్రాదేశిక ఓటర్లు 20 లక్షలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నాటికి గ్రామీణ ఓటర్లు 20,69,770 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 10,43,621, స్త్రీలు 10,26,149 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి తుది జాబితాను 17 తేదీన ప్రచురిస్తారు. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు... జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,681 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓటర్ల జాబితా ఆధారంగా ఈ పోలింగ్ కేంద్రాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్రాల గుర్తింపు ముగిసిన తర్వాత వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అధికారికంగా కలెక్టర్ ఆమోదంతో 17వ తేదీన కేంద్రాల సంఖ్యను ప్రకటిస్తారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ బ్యాలెట్ పద్ధతి ద్వారానే ఓటింగ్ నిర్వహణ ఉంటుంది. 6 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అత్యవసరమైన చోట 7వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. 8న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీరే... జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు, రిటర్నింగ్ అధికారిగా జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా ప్రణాళిక డిప్యూటీ డెరైక్టర్ మోహన్‌రావులు వ్యవహరిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు మండల ప్రత్యేక అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, ఎంపీడీఓలుఅసిస్టెంట్ఎన్నికలఅధికారులుగా వ్యవహరిస్తారు. ఎన్నికల ఏర్పాట్లకు సన్నాహాలు .. ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 7,104 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా ప్రస్తుతం 6,214 బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన బాక్సుల కోసం ఎన్ని కల కమిషన్‌కు లేఖ రాశారు. జెడ్పీటీసీల బ్యాలెట్ పేపరు తెలుపు రంగు, ఎంపీటీసీల బ్యాలెట్‌కు పింక్ రంగు పేపరు వినియోగిస్తారు. -
‘స్థానిక’ వేడి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్:స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సమయం తక్కువగా ఉండటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి చిరిగిన విస్తరిని తలపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు గోడ దూకుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ఓ సవాల్ కానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. తొలి విడతగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీల ఓటరు జాబితాలను ప్రచురించారు. జిల్లాలో 20,18,132 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 10,03,322 మంది కాగా.. మహిళలు 10,14,810. వీరంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటి వరకు 2,415 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొత్త ఓటర్లు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి మండలంలో 10 నుంచి 20 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటయ్యే అవకాశం వుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని మండలాల్లో రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ నియమించాల్సి ఉండగా, సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరించనున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీ సీఈఓ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు సంబంధించి నేడు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న పరిశీలన, 24న ఉప సంహరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. జెడ్పీ చైర్మన్ పీఠంపైనే అందరి దృష్టి జెడ్పీ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో అన్ని ప్రధాన పార్టీల దృష్టి ఈ పీఠంపైనే ఉంది. విభజనకు పచ్చజెండా ఊపడం ద్వారా ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. ఇక తెలుగుదేశం పార్టీ వలస పక్షులతో కాంగ్రెస్ పార్టీని మరిపిస్తోంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న తెలుగుతమ్ముళ్లను అధినేత విస్మరించడం పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలే ఏజెండాగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ మద్దతు పోటీ చేసేందుకు ఆశావహులు అత్యధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. -
ముహూర్తం ఖరారు.. ఇక పల్లె పోరు
* మోగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా *గ్రామాల్లో మొదలైన రాజకీయ సందడి *అభ్యర్థుల ఎంపిక కసరత్తులో పార్టీలు *మద్దతుదారుల సమీకరణలో గ్రామ నాయకులు *ఈవీఎంల మధ్య బ్యాలెట్ పేపర్ల గందరగోళం శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఇంతవరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఎన్నికల పోరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ముహూర్తం ఖరారు కావడంతో ఇప్పుడు పల్లెసీమలకు విస్తరించనుంది. దీంతో ప్రశాంతమైన గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకోనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6వ తేదీన జిల్లాలోని 38 జెడ్పీటీసీలు, 675 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 15న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో రావడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాల నిర్వాకమే కారణమని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో అటు పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా కోర్టు తీర్పు దృష్ట్యా అనివార్యంగా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల పాలకవర్గాలకు పదవీకాలం ముగిసి దాదాపు మూడేళ్లవుతున్నా రకరకాల సాకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రత్యేక అధికారుల పాలనతో పబ్బం గడుపుకుంది. చివరికి కోర్టు మందలించడంతో సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ ఎన్నికల నిర్వహించక తప్పలేదు. పల్లెల్లో సందడి రాజకీయ నాయకత్వం లేక గత మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న పల్లెలు ఒక్కసారి వచ్చిపడిన ఎన్నికలతో సందడి సంతరించుకుంటున్నాయి. గత జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగినా, ఆ తర్వాత తుఫాన్లు, భారీ వర్షాలతో పంటలు పోయి గ్రామీణులు రాజకీయాలు మరచిపోయారు. ఈ తరుణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో గ్రామ రాజకీయాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు మద్దతుదారులు, సానుభూతిపరుల సమీకరణలో, బలాబలాల లెక్కల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలకూ శ్రీకారం చుట్టారు. గందరగోళంలో ఓటర్లు రెండు నెలల వ్యవధిలో ఐదుసార్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రామీణ ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యే అవకాశముంది. మున్సిపల్, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహిస్తుండగా వాటిలో మధ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం బ్యాలెట్ బాక్సులు, పేపర్లు వినియోగిస్తారు. ఇది పల్లె ఓటర్లను ఇబ్బందికి గురి చేసే వ్యవహారమే. ఓటర్లు గందరగోళానికి గురైతే చెల్లని ఓట్లు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గత మూడేళ్లుగా కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు అందక గ్రామాల్లో అభివృద్ది పడకేసింది. ప్రజల నుంచి రాబట్టే వారే తప్ప, సౌకర్యాలు కల్పించే వారే లేకుండా పోయారు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజల కష్టాలపై ప్రశ్నించే వారు కూడా లేకుండా పోయారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అభ్యర్థులపై స్పష్టత లేకపోయినా ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్నది ఆయా ప్రాంతాల ఓటర్లకు చూచాయగా తెలిసిన విషయమే. దీంతో ఎవరి మద్దతుదారుల వెనుక వారు చేరిపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ జిల్లాలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ ఇచ్చారు. శిక్షకులను ఉద్దేశించి ఏజేసీ మహమ్మద్ హసన్ షరీఫ్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. సామగ్రి పంపిణీ చేసే విధానాన్ని సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు తక్షణం శిక్షణ ఇవ్వాలని సూచించారు. విశ్రాంత అధికారులు బలివాడ మల్లేశ్వరరావు, సత్యనారాయణలు ఈ శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పరిషత్ ఎన్నికల స్వరూపం జెడ్పీటీసీలు-38 ఎంపీటీసీలు నామినేషన్ల-675 స్వీకరణ..15 నుంచి తుది గడువు-20 పరిశీలన-21 ఉపసంహరణ గడువు-24 పోలింగ్-ఏప్రిల్ 6 రీపోలింగ్-ఏప్రిల్ 7 ఓట్ల లెక్కింపు -ఏప్రిల్ 8