తొలివిడత ‘ప్రాదేశిక’పోరు నేడే
తొలివిడత ‘ప్రాదేశిక’పోరు నేడే
Published Sun, Apr 6 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM
సాక్షి, కాకినాడ :జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 513 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. 26 జెడ్పీటీసీలలో 111 మంది, 513 ఎంపీటీసీలలో 1321 మంది తలపడుతున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే 12,81, 692 మంది ఓటర్లలో 6,38,194 మంది పురుషులు కాగా, 6,43,498 మంది మహిళలు. 1,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 8,498 మంది సిబ్బందిని నియ మించారు. 2,907 మందికి పైగా పోలీసులను, ప్రత్యేక దళాలను మోహరించారు.
ఓటుకు రూ.1000 వరకు పంపిణీ..
బరిలో ఎంతమంది ఉన్నా ప్రధానపోటీ వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్యే. గత రెండు వారాలుగా నువ్వా, నేనా అన్నట్టు ప్రచారహోరు సాగింది. అయినా ‘ఫ్యాన్’ గాలి ముందు ‘సైకిల్’ బేజారు కాక తప్పదని టీడీపీ నేతలు నిస్పృహ చెందుతున్నారు. పార్టీ స్థానిక, జిల్లా నేతలు వ్యవహరించిన తీరు కూడా తమ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు శనివారం ఒక్కరోజే తెలుగుతమ్ముళ్లు కోట్లు కుమ్మరించారు.ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు డబ్బులు, చీరలు, సారెలు, నిత్యావసరాలు, కొన్ని చోట్ల వెండిరూపులు పంచారు. ఇక మద్యం, నాటుసారా ఏరులై పారించారు.
జనమే వైఎస్సార్ సీపీ బలం
కాగా ప్రజాబలంతో ఎన్నికలను ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీకి గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను మెరుగు పర్చింది. పార్టీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా జ్యోతుల నవీన్‌కుమార్ పేరు ఖరారుతో పాటు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో సాగించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఆ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు కలిసొచ్చింది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగే 26 స్థానాల్లో 20కు పైగా జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ కావడం ఖాయమంటున్నారు. మరో ఆరుచోట్ల పోరు హోరాహోరీగా ఉంటుందని అంచనా.
Advertisement
Advertisement