ఇక సమరమే..
ఇక సమరమే..
Published Tue, Mar 11 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
12న పోలింగ్ కేంద్రాల గుర్తింపు
13న జాబితా తయారు
14న అభ్యంతరాల స్వీకరణ
15న పార్టీలతో సమావేశం
16న కేంద్రాల జాబితా
జిల్లా కలెక్టర్‌కు సమర్పణ
18న తుది జాబితా ప్రచురణ
నల్లగొండ, న్యూస్‌లైన్ :ప్రాదేశిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలతో జిల్లా యంత్రాంగం సతమతమవుతుంటే తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడం రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ప్రకటించడంతోనే గ్రామాల్లో రాజకీయ కోలాహలం మొదలైంది. సోమవారం వివిధ మండలాల్లో రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించాయి. అభ్యర్థుల ఎంపిక , పొత్తులకు సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల్లో వాడివేడిగా చర్చలు చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు 835, జెడ్పీటీసీ 59 స్థానాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం 17న షెడ్యూల్ జారీ చేయనుంది. షెడ్యూల్ జారీ అయిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలై ఏప్రిల్ 8న ఎన్నికల ఫలితాలతో ముగుస్తుంది.
ప్రాదేశిక ఓటర్లు 20 లక్షలు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నాటికి గ్రామీణ ఓటర్లు 20,69,770 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 10,43,621, స్త్రీలు 10,26,149 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి తుది జాబితాను 17 తేదీన ప్రచురిస్తారు.
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు...
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,681 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓటర్ల జాబితా ఆధారంగా ఈ పోలింగ్ కేంద్రాలు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్రాల గుర్తింపు ముగిసిన తర్వాత వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అధికారికంగా కలెక్టర్ ఆమోదంతో 17వ తేదీన కేంద్రాల సంఖ్యను ప్రకటిస్తారు.
బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్
బ్యాలెట్ పద్ధతి ద్వారానే ఓటింగ్ నిర్వహణ ఉంటుంది. 6 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అత్యవసరమైన చోట 7వ తేదీన రీపోలింగ్ ఉంటుంది. 8న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వీరే...
జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు, రిటర్నింగ్ అధికారిగా జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా జిల్లా ప్రణాళిక డిప్యూటీ డెరైక్టర్ మోహన్‌రావులు వ్యవహరిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు మండల ప్రత్యేక అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా, ఎంపీడీఓలుఅసిస్టెంట్‌ఎన్నికలఅధికారులుగా వ్యవహరిస్తారు.
ఎన్నికల ఏర్పాట్లకు సన్నాహాలు ..
ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 7,104 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా ప్రస్తుతం 6,214 బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన బాక్సుల కోసం ఎన్ని కల కమిషన్‌కు లేఖ రాశారు. జెడ్పీటీసీల బ్యాలెట్ పేపరు తెలుపు రంగు, ఎంపీటీసీల బ్యాలెట్‌కు పింక్ రంగు పేపరు వినియోగిస్తారు.
Advertisement
Advertisement