‘స్థానిక’ సమరంపై భూమా దృష్టి
నంద్యాల, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికలు ముగియడంతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గ పరిధిలోని నంద్యాల మండలంలో 19, గోస్పాడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఎంపీటీసీలతోపాటు రెండు జె డ్పీటీసీ స్థానాలకు ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
వైఎస్సార్సీపీ గోస్పాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా యాళ్లూరు మేజర్ పంచాయతీకి చెందిన పల్లెసువర్ణ, నంద్యాల జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్తపల్లె గ్రామానికి చెందిన లక్ష్మిదేవి బరిలో ఉన్నారు. ఆయా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భూమా నాగిరెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని నాయకులు, ప్రజలతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు.
గత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ వర్గీయులకు దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారని.. ఈ సారి కూడా అదే విధమైన తీర్పు రావడానికి శ్రేణులు కృషి చేయాలని కోరారు. ఈ నెల 4వ తేదీ లోపు ప్రచారాన్ని ముగించాల్సి ఉండటంతో అన్ని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలు ముగిస్తే నాలుగేళ్ల పాటు ఇక అటు పట్టణంలో గాని, ఇటు పల్లెల్లో గాని ఎన్నికలు ఉండవని అందువల్ల ఇప్పుడు కష్టపడాలని భూమా కోరారు.