‘స్థానిక’ వేడి
‘స్థానిక’ వేడి
Published Tue, Mar 11 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్:స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజునే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సమయం తక్కువగా ఉండటంతో అధికారుల్లో హడావుడి మొదలైంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి చిరిగిన విస్తరిని తలపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు గోడ దూకుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ఓ సవాల్ కానుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. తొలి విడతగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీటీసీ స్థానాల పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీల ఓటరు జాబితాలను ప్రచురించారు. జిల్లాలో 20,18,132 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 10,03,322 మంది కాగా.. మహిళలు 10,14,810. వీరంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటి వరకు 2,415 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొత్త ఓటర్లు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి మండలంలో 10 నుంచి 20 పోలింగ్ కేంద్రాలు అదనంగా ఏర్పాటయ్యే అవకాశం వుంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని మండలాల్లో రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ నియమించాల్సి ఉండగా, సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరించనున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీ సీఈఓ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు. కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లకు సంబంధించి నేడు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21న పరిశీలన, 24న ఉప సంహరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 6న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, జడ్‌పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది.
జెడ్పీ చైర్మన్ పీఠంపైనే అందరి దృష్టి
జెడ్పీ చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో అన్ని ప్రధాన పార్టీల దృష్టి ఈ పీఠంపైనే ఉంది. విభజనకు పచ్చజెండా ఊపడం ద్వారా ప్రజాగ్రహాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. ఇక తెలుగుదేశం పార్టీ వలస పక్షులతో కాంగ్రెస్ పార్టీని మరిపిస్తోంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న తెలుగుతమ్ముళ్లను అధినేత విస్మరించడం పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలే ఏజెండాగా ముందుకు సాగుతున్న వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు పోటీ చేసేందుకు ఆశావహులు అత్యధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు.
Advertisement