కొత్తగూడెం : విద్యార్థులకు పరీక్షల బెల్ మోగింది. మరో 45 రోజుల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తామని విద్యాశాఖ అధికారులు చెపుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించటం లేదు. అదనపు తరగతుల నేపథ్యంలో సరైన పౌష్టికాహారాన్ని అందించలేకపోవడంతో పాటు వారిని కనీసం పర్యవేక్షించే అధికారులే లేకపోవడం శోచనీయం. గత ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం 80.49 మాత్రమే. ఈ ఏడాది అంతకు మించి ఉత్తీర్ణత పెంచటానికి అధికారులు ప్రత్యేకంగా తీసుకుంటున్న శ్రద్ధ ఏమీ లేకపోవడంతో ‘వంద శాతం’ ఉత్తీర్ణత సా«ధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ టెస్టులపై నిర్వహించని సమీక్ష..
డిసెంబర్ 31 నాటికి పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేసి జనవరిలో ఉదయం, సాయంత్రం అదనపు తరగతులను నిర్వహించాలి. స్పెషల్ టెస్టులు నిర్వహించి వాటిపై డీఈఓ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. టెస్టుల ఫలితాలపై విశ్లేషణ చేసి ఈనెల 15న జరగబోయే ప్రీ ఫైనల్ పరీక్షలకు, మార్చి 15 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేయాలి. ఇందుకోసం విద్యార్థికి ప్రతి సబ్జెక్టుపై నాలుగు, బయాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు రెండు చొప్పున టెస్టులు నిర్వహించాలి. ఈ క్రమంలో జనవరిలో నిర్వహించిన రెండు స్పెషల్ టెస్టులపై డీఈవో వాసంతి సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికీ అలాంటి దాఖలాలు లేకపోవడం గమనార్హం. జనవరి 27న జిల్లా కేంద్రంలో స్పెషల్ టెస్టులపై ప్రధానోపాధ్యాయుల సమావేశం ఉందని డీఈవో ప్రకటించారు. అనంతరం ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు. మళ్లీ ఇంత వరకు సమీక్ష సమావేశం తేదీలనే ప్రకటించలేదు.
ఉపాధ్యాయులపై పర్యవేక్షణ ఏది..?
పరీక్షలకు విద్యార్ధులను సన్నద్ధం చేసే క్రమంలో ఉదయం, సాయంత్రం ఒక గంట అదనంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వారికి మానసిక, శారీరక అలసట కలుగకుండా అల్పాహారం అందించాలి. అయితే జిల్లాలో అదనపు తరగతులు జరుగుతున్నప్పటికీ విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. దీనికి విద్యాశాఖ తరపున ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో దాతలపైనే సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అన్ని పాఠశాలల్లో అల్పాహారం పూర్తి స్థాయిలో పెట్టలేకపోతున్నారు. జిల్లాలో రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో వారిలో జవాబుదారీతనం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘పది’ ఉత్తీర్ణత శాతం పెరిగేనా?
జిల్లా పరిధిలో 2015–16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10277 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 7422 మంది ఉత్తీర్ణులయ్యారు.
2016–17 లో ప్రభుత్వ పాఠశాలల్లో 5522 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4106 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి శాతం 80.49గా ఉంది.
ఈ ఏడాది మార్చి 15 నుంచి జరగనున్న పరీక్షలకు 71 కేంద్రాలలో 174 ప్రభుత్వ, 99 ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 13,235 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 6,493 మంది బాలురు, 6,742 మంది బాలికలు ఉన్నారు.
ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కంటే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వ విద్యపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తుండగా, అంతే నమ్మకంతో ఉపాధ్యాయులు, అధికారులు ఉత్తీర్ణత పెంచితే రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ఆదరణ ఉంటుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేస్తాం
ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించటానికి కృషి చేస్తాం. స్పెషల్ టెస్టులపై రెండు, మూడు రోజుల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. ఫలితాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి అదనంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తాం. ఉపాధ్యాయులు, అ«ధికారులు అందరం ఉమ్మడి కృషితో మెరుగైన ఫలితాలను సాధిస్తాం.
– డి వాసంతి, ఇన్‌చార్జ్ డీఈవో
Comments
Please login to add a commentAdd a comment