అద్దెకు స్టీమ్ ఇంజిన్ రైలు...
109 ఏళ్ల నాటి స్టీమ్ ఇంజిన్ పట్టాలపైకి
సిమ్లా-కాల్కా మధ్య గంటకు రూ. 96,000 అద్దె
సిమ్లా: పర్యాటకులను ఆకర్షించేందుకు రైల్వే శాఖ కొంగొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా 109 ఏళ్ల నాటి స్టీమ్ ఇంజిన్ రైలులో ప్రయాణాలను ఆఫర్ చేస్తోంది. హర్యానాలోని కాల్కా-హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. రెండు లేదా మూడు బోగీలు ఉండే ఈ రైలులో 40 మంది దాకా ప్రయాణించవచ్చు. గంటపైగా దాదాపు 22 కిలోమీటర్ల దూరం వన్ వే ప్రయాణం చేసేందుకు సుమారు రూ. 96,000 (పన్నులన్నీ కలిపి) ఖర్చవుతుంది. కంపెనీలే కాకుండా ఎవరైనా టూరిస్టులు కూడా దీన్ని అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ). 12 మంది సభ్యుల విదేశీ టూరిస్టుల బృందం ఇప్పటికే ఈ ఆఫర్‌ను వినియోగించుకుంది కూడా. సిమ్లా-కాల్కా మధ్య రైల్వే లైన్‌ను 1903లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రారంభించారు.
అప్పట్లో ఈ రెండు ప్రాంతాలకు యూరోపియన్లను చేరవేసిన స్టీమ్ రైళ్లను క్రమంగా 1952 నుంచి పక్కన పెడుతూ డీజిల్ ఇంజిన్లను వాడటం మొదలుపెట్టారు. స్టీమ్ ఇంజిన్ రైళ్లపై పర్యాటకుల మక్కువ చూసి మళ్లీ ఇన్నాళ్లకు మరమ్మతులు చేపట్టి పట్టాలెక్కించారు. హర్యానాలోని కాల్కాలో సముద్ర మట్టానికి 2,100 అడుగుల ఎత్తున ఈ ట్రాక్ ప్రారంభమవుతుంది. 7,000 అడుగుల ఎత్తున ఉన్న సిమ్లాకు చేరుతుంది. మార్గమధ్యంలో 102 టన్నెల్స్ ఉన్నాయి. వీటిల్లో అత్యంత పొడవైనది బారోగ్ దగ్గరుంది. దీని పొడవు అయిదు వేల అడుగులు. ఇది దాటేందుకే మూడు నిమిషాలు పడుతుంది.