steam engine train
-
చికుబుకు చికుబుకు రైలు.. కొత్త సమస్య ఎదురయ్యేను చూడూ...
బుల్లెట్ రైళ్ల యుగం వచ్చినా ఇప్పటికీ స్టీమ్ ఇంజన్‌తో నడిచే హెరిటేజ్ రైళ్లకు ఆదరణ తగ్గలేదు. రెగ్యులర్ ప్రయాణికులు తగ్గిపోయినా టూరిజం, సినిమా షూటింగుల పరంగా హెరిటేజ్ రైళ్లకు ఫుల్ గిరాకీ ఉంది. ముఖ్యంగా బ్రిటన్ దేశంలో హెరిటేజ్ రైళ్లు ఇప్పటికీ పట్టాలపై చుక్‌బుక్ చుక్‌బుక్ అంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ సర్వీసులకు ఇప్పుడు ఊహించని రీతిలో సమస్యలు వచ్చి పడ్డాయి. మన దగ్గర ప్యాలెస్ ఆన్ వీల్స్ పేరుతో రాజస్థాన్‌లో స్టీమ్ ఇంజన్ రైలు నడుస్తోంది. ఇదే తరహాలో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అత్యధికంగా హెరిటేజ్ సర్వీసులు బ్రిటన్‌లో నడుస్తున్నాయి. ఈ రైళ్లు నడిచేందుకు ఇంధనంగా బొగ్గును ఉపయోగిస్తారు. రైళ్లలో ఉపయోగించేందుకు అవసరమైన బొగ్గును సౌత్ వేల్స్లో ఉన్న ఫ్రోస్ వై ఫ్రాన్ మైనింగ్ సంస్థ ఉత్పత్తి చేసేది. ఈ మైన్ కాలపరిమితి కంటే ముందుగానే 2022 జనవరిలో ఇక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి. మరోవైపు హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గులో కొంత మొత్తాన్ని రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి బ్రిటన్ దిగుమతి చేసుకునేది. కాగా ఫ్రిబవరిలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవడంతో అక్కడి నుంచి కూడా దిగుమతి ఆగిపోయింది. దీంతో హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గు తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు 2022 మే 31 వరకే సరిపోతాయని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగియని పక్షంలో మరో నెల రోజులకు మించి ఈ రైళ్లను నడిపించే పరిస్థితి లేదంటున్నాయి బ్రిటన్‌లోని హెరిటేజ్ రైల్ సర్వీసెస్ అందిస్తున్న కంపెనీలు. బొగ్గు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎక్కడ సానుకూల ఫలితాలు కనిపించడం లేదంటున్నాయి. చదవండి: ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే! -
సినిమా రైలు.. డ్రైవర్ లేకుండా పరుగులు తీసి!
చంఢీగఢ్ : 20కి పైగా సినిమాల్లో ఉపయోగించిన రైలింజిన్ డ్రైవర్ లేకుండా రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించి పట్టాలు తప్పింది. హరియాణాలోని రెవారిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆ స్టీమ్ ఇంజిన్ పేరు అక్బర్. దీని ప్రత్యేకత ఏంటంటే.. సుల్తాన్, బాగ్ మిల్కా బాగ్, రంగ్ దే బసంతి సహా 20కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ఈ రైలింజిన్‌ను వినియోగించడం గమనార్హం. ఉన్నతాధికారుల సందర్శనార్థం ఆదివారం అక్బర్‌ను బయటకు తీశారు. ఈ క్రమంలో 65 ఏళ్ల లోకో పైలెట్ (రైలు డ్రైవర్) ఇంజిన్‌ను స్టార్ట్ చేశాడు. బ్రేక్ లెవర్స్ జామ్ అయ్యాయని గుర్తించిన డ్రైవర్ వెంటనే అదనపు డ్రైవర్‌తో కలిసి ఇంజిన్‌నుంచి దూకేశాడని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. రెండు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఇంజిన్ పట్టాలు తప్పినట్లు గుర్తించామని, త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొఘల్ రాజు అక్బర్ పేరు మీదుగా ఈ స్టీమ్ ఇంజిన్‌కు ఆయన పేరు పెట్టారు. భారత రైల్వేల్లో పురాతన స్టీమ్ రైలింజన్లలో ఒకటైన అక్బర్‌ను చిత్తరంజన్ లోకోమెటీవ్ వర్క్స్ తయారుచేయగా.. 1965 నుంచి సేవల్ని అందిస్తోంది. దూకేశాడు. పట్టాలు తప్పడంతో బాగా దెబ్బతిందని, మరమ్మతులకు బాగా ఖర్చు అవుతుందని అధికారులు వాపోతున్నారు. -
పరుగుకు సిద్ధమైన 'ఫెయిరీ క్వీన్'
ప్రపంచంలోనే అత్యంత పురాతన స్టీమ్ ఇంజిన్ రైలు 'ఫెయిరీ క్వీన్' మరోసారి పట్టాలపై పరుగుపెట్టేందుకు సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానాలో గల రెవారీ స్టేషన్ల మధ్య ఫెయిరీ క్వీన్ పరుగు తీయనుంది. ప్రపంచంలో స్టీమ్ ఇంజిన్‌తో పనిచేస్తున్న రైళ్లలో ఫెయిరీ క్వీన్ ఆఖరిది. ప్రపంచవ్యాప్తంగా స్టీమ్ ఇంజిన్ రైలు ప్రేమికులు ఫెయిరీ క్వీన్‌ను ఎక్కేందుకు ఉవ్విళ్లూరేవారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఒక రోజు పరుగుకు(ఈ నెల 11న) ఫెయిరీ క్వీన్ సిద్ధమైంది. 1855లో కిట్సన్, థాంప్సన్, హ్వీవిట్సన్ అనే ముగ్గురు ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో ఫెయిరీ క్వీన్‌ను తయారు చేశారు. అదే ఏడాది ఫెయిరీ క్వీన్ ఇంగ్లాండ్ నుంచి అప్పటి కలకత్తాకు వచ్చింది. 1895 వరకూ హౌరా-రాణీగంజ్‌ల మధ్య నడిచిన ఫెయిరీ క్వీన్‌ను ఫ్లీట్ నంబర్ '22'గా పిలిచేవారు. ఆ తర్వాత బీహార్‌లో కూడా కొద్దికాలం పాటు పరుగులు తీసింది. దాదాపు 40 సంవత్సరాల పాటు చాణక్యపురిలో గల నేషనల్ రైల్ మ్యూజియంలో ఫెయిరీ క్వీన్‌ను ప్రదర్శనకు ఉంచారు. 1997లో మరోమారు మరమ్మత్తులు చేసి పట్టాలెక్కించారు. 1998లో వాడకంలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ ఇంజిన్ రైలుగా ఫెయిరీ క్వీన్ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. అదే ఏడాది అప్పటి ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ యూనిక్ టూరిజం ప్రాజెక్టు కింద ఫెయిరీ క్వీన్‌కు జాతీయ టూరిజం అవార్డును బహుకరించారు. -
అద్దెకు స్టీమ్ ఇంజిన్ రైలు...
109 ఏళ్ల నాటి స్టీమ్ ఇంజిన్ పట్టాలపైకి సిమ్లా-కాల్కా మధ్య గంటకు రూ. 96,000 అద్దె సిమ్లా: పర్యాటకులను ఆకర్షించేందుకు రైల్వే శాఖ కొంగొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా 109 ఏళ్ల నాటి స్టీమ్ ఇంజిన్ రైలులో ప్రయాణాలను ఆఫర్ చేస్తోంది. హర్యానాలోని కాల్కా-హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా మధ్య ఈ రైలు ప్రయాణిస్తుంది. రెండు లేదా మూడు బోగీలు ఉండే ఈ రైలులో 40 మంది దాకా ప్రయాణించవచ్చు. గంటపైగా దాదాపు 22 కిలోమీటర్ల దూరం వన్ వే ప్రయాణం చేసేందుకు సుమారు రూ. 96,000 (పన్నులన్నీ కలిపి) ఖర్చవుతుంది. కంపెనీలే కాకుండా ఎవరైనా టూరిస్టులు కూడా దీన్ని అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). 12 మంది సభ్యుల విదేశీ టూరిస్టుల బృందం ఇప్పటికే ఈ ఆఫర్‌ను వినియోగించుకుంది కూడా. సిమ్లా-కాల్కా మధ్య రైల్వే లైన్‌ను 1903లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ప్రారంభించారు. అప్పట్లో ఈ రెండు ప్రాంతాలకు యూరోపియన్లను చేరవేసిన స్టీమ్ రైళ్లను క్రమంగా 1952 నుంచి పక్కన పెడుతూ డీజిల్ ఇంజిన్లను వాడటం మొదలుపెట్టారు. స్టీమ్ ఇంజిన్ రైళ్లపై పర్యాటకుల మక్కువ చూసి మళ్లీ ఇన్నాళ్లకు మరమ్మతులు చేపట్టి పట్టాలెక్కించారు. హర్యానాలోని కాల్కాలో సముద్ర మట్టానికి 2,100 అడుగుల ఎత్తున ఈ ట్రాక్ ప్రారంభమవుతుంది. 7,000 అడుగుల ఎత్తున ఉన్న సిమ్లాకు చేరుతుంది. మార్గమధ్యంలో 102 టన్నెల్స్ ఉన్నాయి. వీటిల్లో అత్యంత పొడవైనది బారోగ్ దగ్గరుంది. దీని పొడవు అయిదు వేల అడుగులు. ఇది దాటేందుకే మూడు నిమిషాలు పడుతుంది.