జనధన కింద 10 కోట్ల ఖాతాలు
నెల రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించిన బ్యాంకులు
7.28 రుపే కార్డుల జారీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) కింద 10 కోట్ల ఖాతాలు తెరవాలంటూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నెల రోజుల ముందుగానే బ్యాంకులు అధిగమించాయి. డిసెంబర్ 26 నాటికి మొత్తం 10.08 కోట్ల ఖాతాలు తెరిచినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని జనవరి 26 నాటికల్లా సాధించాలని కేంద్రం నిర్దేశించింది. డిసెంబర్ 22 నాటికి 7.28 కోట్ల రుపే కార్డులు జారీ అయ్యాయి.
మిగతా వాటిని జనవరి 15 లోగా జారీ చేస్తామని పీఎంజేడీవై మిషన్ డెరైక్టర్ అనురాగ్ జైన్‌తో జరిగిన భేటీలో బ్యాంకులు తెలిపాయి. ఖాతాదారులందరికీ పాస్‌బుక్‌ల జారీ కూడా ఆలోగా పూర్తి చేయాలని జైన్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులు, ఐబీఏ, ఎన్‌పీసీఐ, యూఐడీఏఐ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు, జీవిత బీమా క్లెయిములను వేగవంతంగా సెటిల్ చేసే అంశాన్ని కూడా ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
క్లెయిమ్ ఫారంలను తమ వెబ్‌సైట్లలో ఉంచాల్సిందిగా బ్యాంకులు, ఎల్‌ఐసీకి కేంద్రం సూచించింది. క్లెయిమ్ దాఖలైన 15 రోజుల్లోగా సెటిల్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కార ప్రక్రియ 30 రోజులు దాటకూడదని ఎల్‌ఐసీని ఆదేశించింది. డిసెంబర్ ఆఖరు నాటికల్లా సర్వే పనులు మొత్తం పూర్తి కాగలవని బ్యాంకులు తెలిపాయి. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి, ఇంకా మిగిలిపోయిన వారి ఖాతాలను తెరవడం చేపడతారు.
అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు 1.23 లక్షల సబ్ సర్వీస్ ఏరియాల్లో బ్యాంక్ ‘మిత్ర’ డివైజ్‌లను ఏర్పాటు చేశాయి. మరో 6.031 ఎస్‌ఎస్‌ఏల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. జనవరి 15 లోగా ఇది పూర్తి చేయాలని, వివరాలను తమ వెబ్‌సైట్లలోనూ పొందుపర్చాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.