రూపే కార్డుకు నోట్ల రద్దు బూస్ట్
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబర్ 8న డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నుంచి పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)ల వద్ద రూపే కార్డు వినియోగం ఏకంగా ఏడు రెట్లు పెరిగింది. రోజువారీ లావాదేవీల సంఖ్య 21 లక్షలకు చేరింది. ఇదే దూకుడు కొనసాగిస్తూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్యను 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రూపే కార్డు నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ఎండీ ఏపీ హోతా తెలిపారు. డీమోనిటైజేషన్‌కి ముందు పీవోఎస్‌ల వద్ద, ఈ–కామర్స్ కొనుగోళ్లలో రూపే కార్డు ద్వారా లావాదేవీలు రోజుకు సుమారు 3 లక్షలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 21 లక్షలకు ఎగిశాయని ఆయన వివరించారు.
ఒకవేళ డీమోనిటైజేషన్ గానీ జరగకపోయి ఉంటే ఈ పరిమాణాన్ని సాధించడానికి మరింతగా శ్రమ పడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. మరోవైపు, తమ ప్లాట్‌ఫాంపై యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవల లావాదేవీలు రోజుకు 1.5 లక్షల నుంచి సుమారు 6 లక్షలకు పెరిగాయని హోతా వివరించారు. అత్యాధునికమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీలు రోజుకు 35,000 నుంచి 70,000కు పెరిగాయని, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచీ ఇప్పటిదాకా 33 బ్యాంకులు ఈ ప్లాట్‌ఫాంలో భాగమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిధి చాలా విస్తృతమైనదని, యూపీఐతో ఈ–వాలెట్లకు వచ్చిన నష్టమేమీ లేదని హోతా చెప్పారు. ఎన్‌పీసీఐ ఇప్పటిదాకా 31.70 కోట్ల మేర రూపే కార్డులు జారీ చేసింది. ఇందులో జన్‌ధన్ ఖాతాదారులకు జారీ చేసినవి సుమారు 20.5 కోట్ల కార్డులు ఉన్నాయి.