12,13న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జూలై 12,13న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీవోఏ) ఈ మేరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు తెలిపారు. దాదాపు రూ. 13 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండిబకాయిలను (ఎన్‌పీఏ) రాబట్టే దిశగా.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, పీఎస్‌బీలను పరిరక్షించడం, బ్యాంకుల విలీన ప్రతిపాదన ఉపసంహరించుకోవడం..
తమ ప్రధాన డిమాండ్లని చెప్పారు. ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి ప్రత్యామ్నాయంగా ఇటీవలే మరో మార్గాన్ని కూడా ప్రతిపాదించిన ప్రభుత్వం ఇంతలోనే హడావుడిగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. మొండిబకాయిల వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంబాబు వ్యాఖ్యానిం చారు. ఎన్‌పీఏల సమస్య కారణంగా పీఎస్‌బీలపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో సమస్యను కట్టడికి చర్యలు తీసుకోకుండా బ్యాంకులను విలీనం చేస్తే.. ప్రైవేట్ వర్గాలకు తప్ప బ్యాంకింగ్ పరిశ్రమకు ఒనగూరే ప్రయోజనాలేమీ లేవని రాంబాబు తెలిపారు. దేశీ బ్యాంకులు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదగడమే విలీన ప్రధానోద్దేశమని చెబుతున్నప్పటికీ.. కోట్ల కొద్దీ పేరుకుపోయిన ఎన్‌పీఏల సమస్యలను పరిష్కరించుకోకుండా ఇదెలా సాధ్యపడగలదని ప్రశ్నించారు.