న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకు విలీనం ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. అసోసియేట్ బ్యాంకులకు చెందిన దాదాపు 45వేలమంది ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జులై 12 న సమ్మెకు దిగనున్నారు. అలాగే జూలై 13న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. అయిదు అనుబంధ బ్యాంకుల స్టేట్ బ్యాంక్ విలీనంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటానికి దిగుతున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలతో ఉద్యమానికి దిగుతున్నట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం వెల్లడించారు. మొండి బకాయిల రికవరీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందనీ.. అదే సందర్భంలో బ్యాంకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ ఇప్పుడు ప్రధానం కాదని ఆయన వాదించారు. 100,000 కోట్ల మేర పేరుకుపోయిన రుణాల రికవరీపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి వీలుగా ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీన ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకులవిలీనానికి కేంద్ర క్యాబినెట సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, హైదరాబాద్, బికనూర్, మైసూర్, పాటియాల, భారతీయ మహిళాబ్యాంక్ వీటిలో ఉన్నాయి.
సమ్మెకు దిగుతున్న బ్యాంకు ఉద్యోగులు
Published Fri, Jun 17 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM
Advertisement
Advertisement