మ్యూచువల్ ఫండ్లలోకి 12,300 కోట్లు
వరుసగా 14 నెలల పాటు పెట్టుబడుల జోరు
ముంబై : దేశీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గత నెల భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా రూ. 12,300 కోట్ల (సుమారు 1.92 బిలియన్ డాలర్లు) నిధులు వెల్లువెత్తాయి. 2008 జనవరి తర్వాత ఫండ్స్‌లో ఈ స్థాయిలో నిధులు రావడం ఇది రెండోసారి. ఇక, వరుసగా 14 నెలల పాటు (2014 మే-2015 జూన్) పెట్టుబడులు వస్తూనే ఉండటం ఇదే తొలిసారి. ఈక్విటీ రీసెర్చ్ ఏషియా నివేదికలో డాయిష్ బ్యాంక్ ఈ విషయాలు తెలిపింది. పెద్ద యెత్తున నిధులు రావడం, విలువలు పెరగడం వంటి పరిణామాల కారణంగా జూన్‌లో ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో రూ. 3,72,300 కోట్లకు చేరిందని వివరించింది.
మరోవైపు, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిటైల్ ఇన్వెస్టర్ల ఊతంతో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు .. ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 33,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్‌లో రూ. 70,000 కోట్లు మాత్రమే రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఒక్క త్రైమాసికంలోనే అందులో దాదాపు సగభాగం మేర పెట్టుబడులు రావడం గమనార్హం.