13వ నెలా ఎగుమతులు మైనస్..
డిసెంబర్‌లో 15% క్షీణత
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల రంగంలో నిరాశాజనక పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా 15 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. ఇలాంటి క్షీణ ధోరణి భారత ఎగుమతుల రంగంలో గడచిన 13 నెలలుగా కొనసాగుతోంది. తాజా సమీక్షా నెలలో ఎగుమతులు విలువ 22 బిలియన్ డాలర్లు.
దిగుమతులూ క్షీణతే...
కాగా దిగుమతుల్లోనూ క్షీణత కొనసాగుతోంది. వార్షిక ప్రాతిపదికన దిగుమతులు 3.88 శాతం క్షీణించి 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్యలోటు ఇదీ...
ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు డిసెంబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేర్చింది. విలువ రూపంలో ఇది 12 బిలియన్ డాలర్లు.
పసిడి భారీ దిగుమతులు 179 శాతం అప్
పసిడి దిగుమతులు భారీగా పెరగడం డిసెంబర్ వాణిజ్య లోటు అధిక స్థాయికి కారణమైంది. 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్‌లో ఈ విలువైన మెటల్ దిగుమతులు 1.36 బిలియన్ డాలర్ల నుంచి 179 శాతం పెరిగి 3.80 బిలియన్ డాలర్లకు ఎగశాయి.