నేల నుంచి నింగికి వేసిన కాంతి నిచ్చెనల్లా ఉన్నాయి కదూ! పశ్చిమ కెనడాలో మైనస్ 30 డిగ్రీల చలితో వణికిపోతున్న ఆల్బర్టా ప్రాంతంలో దర్శనమిస్తున్న ఈ నిట్టనిలువు వెలుతురు స్తంభాల సోయగాలు చూపరుల మనసు దోస్తున్నాయి. ఇవి ఏర్పడాలంటే పర్యావరణపరంగా పలు అంశాలు కలిసి రావాల్సి ఉంటుంది.
–10 నుంచి –40 డిగ్రీల మధ్యలో వాతావరణం అతి శీతలంగా, హెచ్చు తేమతో, గాలన్నదే వీయకుండా స్తబ్ధుగా ఉండాలి. అలాంటి వాతావరణంలో 0.02 మి.మీ. మందంతో కూడిన బుల్లి మంచు రేణువులు నిట్టనిలువుగా కాకుండా నేలకు కాస్త సమాంతరంగా కిందకు పడుతూ ఉండాలి. వాటి గుండా కాంతి నిర్దిష్ట కోణాల్లో ప్రసరిస్తే ఆ మంచు రేణువులు లక్షలాది బుల్లి అద్దాలుగా మారతాయి. వాటిపై పడుతూ కాంతి ఊహాతీతమైన తీరులో పరావర్తనం చెందుతుంది.
ఫలితంగా ఇలాంటి నిలువు వెలుగులు సాక్షాత్కరిస్తాయి. ఆ కాంతికి మూలం వీధి దీపాలు మొదలుకుని చంద్ర కిరణాల దాకా ఏదైనా కావచ్చు. కెనడాతో పాటు అలస్కా, రష్యా తదితర చోట్ల అతి శీతల ప్రాంతాల్లో ఇవి తరచూ ఏర్పడుతుంటాయి. ఇవి నిజానికి కేవలం ఓ దృశ్య భ్రాంతి మాత్రమేనని సైంటిస్టులు అంటారు. వాళ్లేం చెప్పినా స్థానికులు వీటిని మానవాతీత శక్తి తాలూకు విన్యాసాలుగా నమ్ముతుంటారు. ఎగిరే పళ్లేల్లాగే ఇవి కూడా గ్రహాంతరవాసుల వాహనాలని భావిస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment