ఈ-రిటైల్‌లో 14.5 లక్షల జాబ్స్
ఈ-రిటైల్‌లో 14.5 లక్షల జాబ్స్
Published Wed, Dec 7 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో అత్యధికం
2021 నాటికి సాకారం: కేపీఎంజీ
అప్పటికల్లా 103 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్
న్యూఢిల్లీ: మున్ముందు ఈ-రిటైల్ రంగం ఉపాధి అవకాశాల హబ్‌గా మారనుంది. 2021 నాటికి దేశీయ ఈ-రిటైల్ రంగం, దానికి అనుబంధంగా పనిచేసే లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ (గోదాములు), ఐటీ/ఐటీఈఎస్ వంటి రంగాల్లో ఏకంగా 14.5 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని స్నాప్‌డీల్, కేపీఎంజీ నివేదిక తెలియజేసింది. ఈ రెండు సంస్థలూ ‘దేశంలో ఉపాధి అవకాశాలపై ఈ-కామర్స్ ప్రభావం’ పేరుతో సంయుక్త అధ్యయన నివేదికను విడుదల చేశారుు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ద్వారా ఈ-కామర్స్ రంగం సామాజిక, ఆర్థిక రంగంపై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రధాన రంగంతోపాటు దాని అనుబంధ రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన, నూతన వ్యాపార అవకాశాలు, సామాజిక - ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదీ ఈ నివేదిక ద్వారా తెలియజేయాలనుకున్నట్టు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బెహల్ తెలిపారు.
నివేదికలోని అంశాలు
లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగం అత్యధికంగా 10 లక్షల మేర ప్రత్యక్ష ఉద్యోగాలను తీసుకురానుంది. ఈటైల్ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడుకున్న 4 లక్షల ఉద్యోగాలు ఏర్పడతారుు. ఈ-కామర్స్ రంగంలో కొత్తగా రానున్న ప్రతీ ఉద్యోగంతో దాని అనుబంధ రంగాల్లో మూడు నుంచి నాలుగు కొత్త ఉద్యోగాలు ఏర్పడతారుు.
2020 నాటికి ఈ కామర్స్ రంగం 103 బిలియన్ డాలర్ల (రూ.6.9లక్షల కోట్లు) స్థారుుకి చేరుకుంటుంది. ఇందులో ఈటైల్ రంగం వాటా 67 శాతం (68 బిలియన్ డాలర్లు).
ఆన్‌లైన్ విక్రేతల సంఖ్య సైతం 2020 నాటికి 13 లక్షల సంఖ్యకు వృద్ధి చెందుతుంది. 70 శాతం ఆన్‌లైన్ విక్రేతలు చిన్న పట్టణాల నుంచి రానున్నారు.
అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వీలుగా పరిశోధన అభివృద్ధిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కార్మిక సంస్కరణలను మెరుగుపరచడం, వృత్తిపరమైన శిక్షణ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అవసరం.
Advertisement
Advertisement