హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారు బొమ్మలతో ఆడుకోని పిల్లాడుంటాడా? జతిన్ కూడా అలాంటివాడే. కాకపోతే దాన్ని ఆటకే పరిమితం చేయకుండా వ్యాపారంగా మార్చేసుకున్నాడు. ‘లగ్జరీ కారు కొనాలని, కనీసం ఒక్కసారైనా నడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, అందరూ కొనలేరు’ ఈ వ్యత్యాసాన్నే వేదికగా చేసుకొని బిగ్ బాయ్ టాయిస్ (బీబీటీ) ప్రారంభించాడు. ప్రీ ఓన్డ్ లగ్జరీ కార్లను మాత్రమే విక్రయించడం దీని ప్రత్యేకత. గుర్గావ్‌లో 35 వేల చదరపు అడగుల్లో దేశంలోనే అతిపెద్ద షోరూమ్ కలిగిన బీబీటీ... త్వరలోనే హైదరాబాద్‌లో స్టూడియో తరహా ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా బీబీటీ ఫౌండర్ అండ్ ఎండీ జతిన్ అహుజా ‘స్టార్టప్ డైరీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
18 బ్రాండ్లు, 95 లగ్జరీ కార్లు
రూ.70 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా 2009లో బిగ్ బాయ్ టాయిజ్.కామ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆస్టిన్ మార్టిన్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, జాగ్వార్, లెక్సస్, ఫోర్డ్, బెంట్లీ, క్రిస్లర్, హమ్మర్, ల్యాండ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్, రోల్స్ రాయిస్, డీసీ, ఆడి, కాడిలాక్, లాంబోర్గిని, పోర్షే, ఫోక్స్‌వ్యాగన్, వోల్వో వంటి 18 రకాల బ్రాండ్లు, 150 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకుంటాయి. రూ.50 లక్షల్లో జాగ్వార్ ఎక్స్‌జేఎల్, రూ.4 కోట్లలో లాంబొర్గినీ, రోల్స్ రాయిస్ కార్లున్నాయి. జర్మనీ, యూకే వంటి ఆరు దేశాల్లోని కస్టమర్ల నుంచి కార్లు కొని, వాటిని రీమోడల్ చేసి మన దేశంలో విక్రయిస్తుంటాం. ప్రతి కారునూ 151 రకాల చెక్ పాయింట్స్, బీమా, న్యాయ పరమైన అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాకే విక్రయానికి పెడతాం.
హైదరాబాద్‌లో 110 కార్లు రయ్..రయ్..
ప్రస్తుతం నెలకు 35 కార్లను విక్రయిస్తున్నాం. ఇండియన్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, దినేష్ కార్తీక్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జయరాజ్ వంటి చాలామంది మా కస్టమర్లే. బీబీలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్లు రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్. గతేడాది రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేశాం. ఈ ఏడాది రూ.270 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఏటా 35 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 38 శాతం. హైదరాబాద్ వాటా 14 శాతం. ఇప్పటివరకు ఇక్కడ నుంచి 110 లగ్జరీ కార్లను కొన్నారు. 2021 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను సాధించాలని లకి‡్ష్యంచాం.
హైదరాబాద్‌లో స్టూడియో షోరూమ్..
ఆన్‌లైన్‌తో పాటూ ఆఫ్‌లైన్‌లో గుర్గావ్, ఢిల్లీల్లో 2 షోరూమ్‌లున్నాయి. దేశంలో అతిపెద్ద లగ్జరీ కార్ల షోరూమ్ 35 వేల చ.అ.ల్లో గుర్గావ్‌లో ఉంది. దీన్లో 107 కార్ల డిస్‌ప్లే ఉంటుంది. ఢిల్లీ షోరూమ్ 7 వేల చదరపు అడుగుల్లో ఉంది. ఇందులో 25 కార్ల డిస్‌ప్లే ఉంటుంది. ఏడాదిలో హైదరాబాద్, ముంబై, కోల్‌కత్తాల్లో ఔట్‌లెట్లు ఆరంభిస్తాం. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో స్టూడియో తరహా షోరూమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సుమారు 3,500 చదరపు అడుగుల్లో రానున్న ఈ స్టోర్‌లో 10 కార్ల డిస్‌ప్లే ఉంటుంది. ఒక్కో ఔట్‌లెట్‌పై రూ.20 కోట్ల పెట్టుబడి పెడతాం.
వచ్చేనెలలో గుర్గావ్‌లో రూ.12 కోట్ల పెట్టుబడితో వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తున్నాం. దీన్లో యాక్సెసరీస్‌తో పాటు సర్వీసింగ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మా సంస్థలో వంద మంది ఉద్యోగులున్నారు. లగ్జరీ కార్లను కొనలేని కస్టమర్ల కోసం ‘మర్చండైజ్’ పేరిట మరో విభాగం ఉంది. ఇందులో లగ్జరీ కార్ బ్రాండ్ల కీ చెయిన్స్, పర్‌ఫ్యూమ్స్, స్టిక్కర్లను విక్రయిస్తాం. త్వరలో పెన్నులు, షర్టులు, టీ షర్టులను కూడా అందుబాటులోకి తెస్తాం.
Comments
Please login to add a commentAdd a comment