న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు రిటైలింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రిఫైనరీ మార్జిన్లు మెరుగుపడడంతో కంపెనీ లాభం 18.4 శాతం పెరిగి రూ.3,696 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,121 కోట్లుగానే ఉంది. ఆదాయం రూ.1,10,637 కోట్లుగా ఉంది.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,00,260 కోట్లు. ప్రతి బ్యారెల్ ముడి చమురు శుద్ధిపై స్థూల మార్జిన్ సెప్టెంబర్ క్వార్టర్లో 7.98 డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మార్జిన్ 4.32 డాలర్లతోపోలిస్తే దాదాపు రెట్టింపైంది. దీనికి తోడు ఇన్వెంటరీ లాభాలు (కొన్న రేటు నుంచి మార్కెట్లో విక్రయించిన రేటుకు మధ్య వ్యత్యాసం) రూపంలో కంపెనీకి కలిసొచ్చింది. రూ.1,056 కోట్లను కంపెనీ ఈ రూపంలో ఆర్జించింది.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఇన్వెంటరీ రూపంలో రూ.686 కోట్లను నష్టపోవడం గమనార్హం. దేశీయంగా ఇంధన విక్రయాలు 18.4 మిలియన్ టన్నుల నుంచి 19 మిలియన్ టన్నులకు పెరగ్గా, ఎగుమతులు మాత్రం 52 శాతం అధికంగా 1.877 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ 16.1 మిలియన్ టన్నుల ముడి చమురును ఇంధనంగా మార్చింది.
అంతకుముందు ఏడాది కాలంలో ఇది 15.6 మిలియన్ టన్నులుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఆదాయం రూ.2,07,458 కోట్ల నుంచి రూ.2,38,828 కోట్లకు పెరిగింది. నికర లాభం మాత్రం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 11,391 కోట్ల నుంచి రూ.8,245 కోట్లకు తగ్గిపోయింది. దీనికి ఇన్వెంటరీ రూపంలో ఎదురైన నష్టాలే కారణమని కంపెనీ తెలిపింది.
ఏప్రిల్–సెస్టెంబర్ మధ్య స్థూల రిఫైనరీ మార్జిన్ బ్యారెల్‌కు 6.08 డాలర్లుగా ఉండగా, గతేడాది ఇదే కాలంలో 9.19 డాలర్లుగా ఉండడం గమనార్హం. వడ్డీరహిత రుణంపై ఒడిషా ప్రభుత్వంతో వివాదం పరిష్కరించుకున్నట్టు ఐవోసీ తెలిపింది. అలాగే, హర్యానా రాష్ట్రంలో ప్రవేశ పన్ను చెల్లించాల్సిన అంశం కూడా పరిష్కారమైందని, దీంతో రూ.2,808 కోట్లు వెనక్కి వచ్చాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment