
అయిదేళ్లలో 20 కొత్త మోడళ్లు
వాహన తయారీ దిగ్గజం సుజుకి 2020 నాటికి 20 కొత్త మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టనుంది
2020 నాటికి ఏటా 20 లక్షల యూనిట్ల విక్రయం
{పీమియం కార్ల విక్రయాలకు ‘నెక్సా’ షోరూంలు
మారుతి సుజుకి మార్కెటింగ్ ఈడీ ఆర్‌ఎస్ కల్సి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాహన తయారీ దిగ్గజం సుజుకి 2020 నాటికి 20 కొత్త మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ మోడళ్లను విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా సుజుకి విక్రయాల్లో భారత్ వాటా 50 శాతంగా ఉంది. ఇక మోడళ్ల వారీగా చూస్తే ఈ ఏడాది ఆగస్టు 5న కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ ఎస్-క్రాస్‌ను మారుతి సుజుకి భారత్‌లో విడుదల చేస్తోంది. ఆగస్టు 20న ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరిస్తోంది. మధ్యతరగతి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆల్టో 800 డీజిల్ వేరియంట్ క్రిస్‌మస్ నాటికి రోడ్డెక్కుతుందని సమాచారం.
కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌ఏ ఆల్ఫా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రానుందని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.ఎస్.కల్సి శుక్రవారం చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద వరుణ్ మోటార్స్ సంస్థ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లో సాబూ ఆర్‌కేఎస్ మోటార్స్ సంస్థ ఏర్పాటు చేసిన రెండు నెక్సా షోరూంలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏటా 20 లక్షల యూనిట్లు...
మారుతి సుజుకి 2014-15లో భారత్‌లో 11.7 లక్షల కార్లను విక్రయించింది. 2020 నాటికి ఏటా 20 లక్షల యూనిట్ల అమ్మకాలకు చేరుకోవాలన్నది లక్ష్యమని కల్సి చెప్పారు. ‘దేశీయ కార్ల మార్కెట్లో 18 కంపెనీలున్నాయి. మారుతి సుజుకి 46 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. జూన్ త్రైమాసికంలో 13 శాతం వృద్ధి నమోదు చేశాం. తదుపరి కాలంలోనూ రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం. 2015-16లో పరిశ్రమ 6-8 శాతం వృద్ధిని ఆశిస్తోంది. హరియాణా ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. భద్రతపర పరీక్షలు అక్కడే చేపడతాం. దీంతో మోడళ్లను త్వరితంగా ప్రవేశపెట్టొచ్చు’ అని తెలిపారు. కంపెనీ ప్లాంట్ల సామర్థ్యం 15 లక్షల యూనిట్లు. 7.5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో గుజరాత్‌లో నెలకొల్పుతున్న ప్లాంటు 2017 కల్లా ప్రారంభం కానుంది.
100 నెక్సా షోరూంలు..
ప్రీమియం కార్ల విక్రయానికి మారుతి సుజుకి ప్రత్యేకంగా ‘నెక్సా’ పేరిట అత్యాధునికంగా తీర్చిదిద్దిన షోరూంలను ప్రధాన నగరాల్లో నెలకొల్పుతోంది. ఔట్‌లెట్ల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను సైతం కొనుగోలు చేస్తోందని సమాచారం. ఆగస్టు తొలి వారంలో 40 దాకా షోరూంలు ఏర్పాటవుతున్నాయి. మార్చికల్లా 100 షోరూంలు రానున్నాయి. కొత్తతరం కస్టమర్ల ఆశలకు అనుగుణంగా షోరూంలతోపాటు ఆధునిక మోడళ్లను తెస్తున్నామని కంపెనీ మార్కెటింగ్ ఈడీ హషిమొతో తెలిపారు. ఆకట్టుకునే స్టైల్, ఉత్తమ పనితీరుతోపాటు అధిక మైలేజీ ఇచ్చేలా వాహనాలకు డిజైన్ చేస్తున్నామన్నారు.