
సాక్షి, న్యూఢిల్లీ : చేతితో రూపొందించిన ఫర్నీచర్ నుంచి శాంపు, శానిటరీ వేర్, ప్లే వుడ్ వరకు మొత్తం 200 పైగా వస్తువులు ఇక చౌకగా లభ్యం కానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో గౌహతిలో జరుగుతున్న భేటీలో నేడు జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఎక్కువగా వినియోగదారులు వాడే వస్తువులపై పన్ను రేట్లు కోత విధించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న సేవలు, వస్తువుల్లో 80 శాతం ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్లను కూడా తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. పన్ను రేట్లను తగ్గించాలని అభ్యర్థిస్తూ రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ కౌన్సిల్‌తో భేటీ అయి తమ గోడును వినిపించుకున్నారు.
జీఎస్‌టీ 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 227 ఐటమ్స్‌లో దాదాపు 80 శాతం ఐటమ్స్‌ను 18 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశం ఉందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నవాటిలో చాలా ఐటమ్స్‌ను 12 శాతం జీఎస్‌టీకి తగ్గించాలని కూడా జీఎస్‌టీ ఫిట్‌మెంట్ కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
నేడు పన్ను రేట్లు తగ్గబోతున్న వస్తువులు...
- చేతితో రూపొందించిన ఫర్నీచర్, షాంపు, శానిటరీ వేర్, స్యూట్‌కేస్, వాల్ పేపర్, ప్లేవుడ్, స్టేషనరీ ఆర్టికల్స్, వాచ్, ప్లే ఇన్‌స్ట్రుమెంట్స్
- రెస్టారెంట్లపై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు ప్యానెల్ నిర్ణయం
- కాంపోజిషన్ స్కీమ్ కింద కవర్ చేయని ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్ల మధ్య పన్ను రేటు వ్యత్యాసం ఉండకూడదని అస్సాం ఆర్థికమంత్రి హిమంత్ బిస్వా శర్మ ఆధ్వర్యంలోని ప్యానెల్ ప్రతిపాదించింది. ఒకే విధంగా 12 శాతం పన్ను రేటు ఉండాలని పేర్కొంది.
- ప్రస్తుతం నాన్ ఏసీ రెస్టారెంట్లకు 12 శాతం జీఎస్టీ, ఏసీ రెస్టారెంట్లకు 18 శాతం పన్ను రేట్లు ఉన్నాయి.
- ప్రస్తుతం 28 శాతం పన్ను కేటగిరీలో ఉన్న 5-స్టార్ హోటళ్లను ప్రత్యేక కేటగిరీ కింద ఉంచడం కాకుండా.. రూమ్ టారిఫ్ రూ.7500 దాటిన వారందరికీ ఒకే విధంగా 18 శాతం పన్ను విధించాలని ప్యానెల్ నిర్ణయించింది.
- కోటికి వరకు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారస్తులు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇన్‌పుట్ క్రెడిట్లు లేకుండా ఫ్లాట్ రేటులో పన్ను చెల్లించుకోవచ్చు.
- చిన్న వ్యాపారస్తులకు పడుతున్న ఒత్తిడి మేరకు, ప్రతి నెలా మూడు సార్లు ఫైల్ చేయాల్సిన రిటర్నులపై కూడా జీఎస్టీ కౌన్సిల్ సమీక్ష జరుపుతోంది.
- జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ పన్ను విధానంపై ప్రతి నెలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుపుతోంది. జీఎస్టీ కింద ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment