న్యూఢిల్లీ: ద్వారకాదాస్ ఇంటర్నేషనల్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా 2014లోనే ప్రకటించామని ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించింది. ఇదే విషయాన్ని సీబీఐతోపాటు, ఆర్‌బీఐకి అప్పుడే నివేదించామని తెలిపింది. రూ.389.85 కోట్ల ఈ స్కామ్ తమ లాభదాయకతపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇందుకు సంబంధించిన కేటాయింపులను ఇప్పటికే పూర్తి చేశామని స్పష్టం చేసింది.
ద్వారకాదాస్ ఇంటర్నేషనల్‌కు ఇచ్చిన రుణం నిరర్థకంగా, మొండి బకాయిగా 2014 మార్చి 31న మారిందని, ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఆ కంపెనీని అదే ఏడాది జూన్ 30న ప్రకటించామని ఓబీసీ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేసింది. అమల్లో ఉన్న చట్టాల మేరకు ఈ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా సీబీఐ, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేశామని వివరించింది.
ఓబీసీ గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ద్వారాకాదాస్ సేఠ్ ఇంటర్నేషనల్, ఆ కంపెనీ డైరెక్టర్లపై రూ.389.85 కోట్ల రుణ మోసానికి సంబంధించి సీబీఐ ఇటీవలే ఫిర్యాదు నమోదు చేయడం గమనార్హం. ద్వారాకాదాస్ కంపెనీ 2007–12 మధ్య కాలంలో ఓబీసీ నుంచి రూ.389 కోట్ల మేర రుణ సదుపాయం పొంది బంగారం, వజ్రాభరణాల కొనుగోలుకు రుణాలిచ్చిన ఇతర సంస్థలకు చెల్లించింది. బంగారం, డబ్బుల్ని కల్పిత లావాదేవీల ద్వారా దేశాన్ని దాటించిందని సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment