2017లో భారత్ కు హస్క్ వర్ణ బైక్స్!
♦ స్పోర్ట్స్ బైక్స్‌లో కేటీఎం వాటా 35%
♦ బజాజ్ ఆటో ప్రో బైకింగ్ ఎస్‌వీపీ అమిత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం తన అనుబంధ కంపెనీ అయిన హస్క్‌వర్ణ బైక్‌లను వచ్చే ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా హస్క్‌వర్ణ బైక్‌లకు మంచి క్రేజ్ ఉంది. బజాజ్‌కు చెందిన చకన్ ప్లాంటులో.. బజాజ్, కేటీఎంలు సంయుక్తంగా ఈ మోడళ్లను ఈ ఏడాది నుంచే అభివృద్ధి చేయనున్నాయి. తొలుత యూరప్, యూఎస్ తదితర దేశాల్లో ఈ మోడళ్లను విడుదల చేస్తారు. ఆ తర్వాత భారత్‌కు పరిచయం చేస్తారు. మేడ్ ఇన్ ఇండియా హస్క్‌వర్ణ బైక్స్ 2017లో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టే అవకాశం ఉందని బజాజ్ ఆటో ప్రో బైకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ నంది మంగళవారం వెల్లడించారు. శ్రీ వినాయక బజాజ్ ఇక్కడి కాచిగూడలో ఏర్పాటు చేసిన కేటీఎం ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 35%..: భారత్‌లో ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్ మార్కెట్ వార్షిక పరిమాణం 1,20,000-1,50,000 యూనిట్లు. వృద్ధి రేటు 15 శాతముంది. ఆర్జిస్తున్న యువత అధిక సామర్థ్యమున్న బైక్స్‌ను కోరుకుంటున్నారు. బ్రాండ్స్‌పట్ల అవగాహన పెరిగిందని అమిత్ నంది తెలిపారు. ‘ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్ రంగంలో దేశంలో కేటీఎంకు 35 శాతం వాటా ఉంది. 2014-15లో 23 వేల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 32 వేల యూనిట్లు అంచనా వేస్తున్నాం. 200 సీసీ మోడళ్ల వాటా ఏకంగా 70 శాతముంది’ అని వెల్లడించారు. 80 దేశాలకు కేటీఎం బైక్స్‌ను బజాజ్ ఎగుమతి చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కేటీఎంకు 50 శాతం పైగా వాటా ఉందని శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి తెలిపారు.