ఆసియా కంపెనీలకు గడ్డుకాలమే!
♦ 2016పై మూడీస్ నివేదిక
♦ చైనా మందగమనంపై ఆందోళన
న్యూఢిల్లీ: ఆసియా కంపెనీలకు 2016 సవాళ్లను విసరనుందని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ రిసెర్చ్ అనలిస్ట్ రాహుల్ ఘోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మందగమనం, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ముఖ్యాంశాలు...
ఆసియా వ్యాప్తంగా పలు దేశాల్లో 2016లో వృద్ధి మందగించడమో లేక స్థిరంగా ఉండడమో జరుగుతుంది. మూలధనం లభ్యతలో ఒడిదుడుకుల కారణంగా కార్పొరేట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. బలహీన ఆర్థిక వృద్ధి రేటు, కమోడిటీ ధరల పతనం వంటి అంశాలు పలు దేశాల్లో విదేశీ కరెన్సీ ఒడిదుడుకులు, తద్వారా క్రెడిట్ రిస్క్‌కు దారితీయవచ్చు. 6.5 శాతం ఎగువన వృద్ధి రేటును నిలబెట్టడం, సంస్కరణల అమలు, ఆర్థిక సమతౌల్యత, ద్రవ్య స్థిరత్వం వంటి అంశాలు చైనాకు సవాళ్లు.
ఆయా అంశాలు ఆసియా మొత్తం ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. 2015 తరహాలోనే 2016లో కూడా కార్పొరేట్ క్రెడిట్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఆయా అంశాలు మరింత రేటింగ్ ఒత్తిళ్లకు, డిఫాల్ట్స్‌కు దారితీయవచ్చు. ప్రత్యేకించి స్పెక్యులేటివ్ గ్రేడ్ కంపెనీలపై ఆయా అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. తగిన ద్రవ్య పరపతి విధానాలు, స్థానిక బాండ్ మార్కెట్స్, బ్యాంకింగ్‌లో పటిష్ట నిధుల పరిస్థితులు, రీఫైనాన్సింగ్ అవసరాలను నిర్వహించగలిగిన సత్తా వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థలకు కొంత మేలు చేస్తాయి. ఆసియా బ్యాంకుల విషయానికి వస్తే... రుణ నాణ్యత, లాభాలు క్షీణించనున్నాయి. వృద్ధి మందగమనం వల్ల బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య తీవ్రం కావచ్చు.