ఇన్ఫీలో మరో వివాదం: డైరెక్టర్లు రాజీనామా?
ఆధార కార్డుల ఆర్కిటెక్ట్ నందన్ నిలేకని, ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేయనున్నారా? ఆయన రీఎంట్రీతో ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సమస్యలు సద్దుమణుగుతాయా? లేదా? ఆయన రాక మరింత వివాదానికి తెరతీసిందే అవకాశముందా? ప్రస్తుతం టెక్ ఇండస్ట్రిలో ఇదే చర్చనీయాంశంగా మారాయి. నందన్ నిలేకని రీఎంట్రీ కన్‌ఫామ్ అని ఇప్పటికే పలువురు చెప్పేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆయన కొన్ని రోజుల్లో పదవిని అలంకరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 2009లో ఇన్ఫోసిస్ సీఈవోగా ఆయన పక్కకు తప్పుకున్నప్పటి నుంచి ఆయన ఎలాంటి అధికారిక స్థానాలను కంపెనీలో అలంకరించలేదు.
12 దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్‌కంపెనీలు నందన్ నిలేకని పునరాగమనం చేయాలంటూ బోర్డుకు లేఖ కూడా రాశారు. ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టడానికి నిలేకనినే కరెక్ట్ అంటూ పేర్కొన్నారు. నిలేకని రీఎంట్రీతో ఇన్ఫోసిస్ బోర్డు అంతా పునర్‌నిర్మాణం జరుగనుంది. ఈ పునర్ నిర్మాణంలో మరో వివాదం చోటుచేసుకోబోతుంది. నిలేకని రీఎంట్రీ చేస్తే, కొందరు బోర్డు డైరెక్టర్లు రాజీనామా చేద్దామని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చైర్మన్ ఆర్ శేషసాయి, డైరెక్టర్లు రూపా కుద్వా, జెఫ్ లెహ్మన్, కో-చైర్మన్ రవి వెంకటేషన్ కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.
ప్రస్తుతం బోర్డులో ఉండేవారిలో నారాయణమూర్తి దూరపు బంధువు డీఎన్ ప్రహ్లాద్, ఇటీవలే ఇన్ఫీ బోర్డులోకి చేరిన డీ సుందరమ్, పునితా కుమార్ సిన్హాలు మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిసింది. నారాయణమూర్తికి, నిలేకని సన్నిహితంగా ఉండే బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందర్ షా కూడా బోర్డులో సభ్యురాలిగా ఉంటారో లేదో స్పష్టతలేదు. బుధవారం నిలేకని, మూర్తి కూడా సమావేశమయ్యారని, ఇన్ఫీలోకి రావడానికి కొంత భరోసాను నిలేకని కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నిలేకని చైర్మన్‌షిప్‌లో మూర్తి బోర్డులో చేరే పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.