న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర నష్టాలు 2017–18 నాలుగో క్వార్టర్‌లో మూడు రెట్లకు పైగా పెరిగాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.592 కోట్లుగా ఉన్న నికర లాభం తాజా క్యూ4లో రూ.2,114 కోట్లకు పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.7,121 కోట్ల నుంచి రూ.6,302 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది.
2.47 శాతానికి తగ్గిన నికర వడ్డీ మార్జిన్
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,439 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,105 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలకు భారీగా కేటాయింపులు జరపడం, ఎన్‌సీఎల్‌టీ ఖాతాలకు అదనపు కేటాయింపులు జరపడం, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ట్రేడింగ్ లాభం బాగా తగ్గడం, నికర వడ్డీ ఆదాయం క్షీణించడం దీనికి ప్రధాన కారణాలని బ్యాంకు పేర్కొంది. ఇక ఆదాయం రూ.27,537 కోట్ల నుంచి రూ.26,659 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,574 కోట్ల నుంచి రూ.6,517 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 2.51 శాతం నుంచి 2.47 శాతానికి తగ్గాయి.
భారీగా పెరిగిన మొండి బకాయిలు....
2016–17లో రూ.27,251 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.38,131 కోట్లకు పెరిగాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. నికర మొండి బకాయిలు రూ.14,218 కోట్ల నుంచి రూ.17,378 కోట్లకు ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 17.81 శాతం నుంచి 21.48 శాతానికి, నికర మొండి బకాయిలు 10.20 శాతం నుంచి 11.10 శాతానికి పెరిగాయి.
నగదు రికవరీ రూ.376 కోట్ల నుంచి రూ.854 కోట్లకు మెరుగుపడిందని, అలాగే మొత్తం వ్యాపారం రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.72 లక్షల కోట్లకు పెరిగిందని బ్యాంకు వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సెంట్రల్ బ్యాంక్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.67 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.62ను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment