న్యూఢిల్లీ: భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 2,45,000 దాటేసింది. దేశంలోని మొత్తం కుటుంబాల సంపద విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇక 2022 నాటికి మిలియనీర్ల సంఖ్య 3,72,000కి, మొత్తం కుటుంబాల సంపద విలువ 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. క్రెడిట్ సూసీ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. 2000 నుంచి చూస్తే భారత్‌లో సంపద విలువ వార్షికంగా 9.9 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది.
అంతర్జాతీయంగా ఈ వృద్ధి సగటున 6 శాతమే కావడం గమనార్హం. అలాగే భారత్ 451 బిలియన్ డాలర్ల సంపద పెరుగుదలతో గ్లోబల్‌గా 8వ అతిపెద్ద దేశంగా ఉంది. ‘భారత్‌లో సంపద పెరుగుదల ఉంది. కానీ ఇందులో అందరి భాగస్వామ్యం లేదు. 92% మంది వయోజనుల సంపద 10,000 డాలర్లకు లోపే ఉంటే.. కేవలం 0.5 శాతం మంది వయోజనుల సంపద 1,00,000 డాలర్లుగా ఉంది’ అని నివేదిక పేర్కొంది.
ఇక మొత్తం ప్రపంచ సంపద 6.4 శాతం వృద్ధితో 280 ట్రిలియన్ డాలర్లకు ఎగిసింది. వయోజన సంపద పరంగా చూస్తే 5,37,600 డాలర్లతో స్విట్జర్లాండ్ అత్యంత ధనిక దేశంగా ఉంది. దీని తర్వాతి స్థానంలో వరుసగా ఆస్ట్రేలియా (4,02,600 డాలర్లు), అమెరికా (3,88,000 డాలర్లు) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment