న్యూఢిల్లీ: ఫ్లాట్లు, దుకాణాలు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. వీటి విలువ రూ.3,500 కోట్ల పైగా ఉంటుందని తెలిపింది. 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఈ చట్టం కింద బినామీ ఆస్తులను (స్థిర, చరాస్తులు) ముందు తాత్కాలికంగా... ఆ తర్వాత పూర్తిగా జప్తు చేసే అధికారాలుంటాయి. అలాగే అనుచిత లబ్ధి పొందిన యజమాని, బినామీగా వ్యవహరించిన వారు, లావాదేవీలకు కారకులైన వారిపై న్యాయ విచారణ జరపవచ్చు. దోషులుగా తేలిన పక్షంలో ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ప్రాపర్టీ మార్కెట్ విలువలో 25 శాతం దాకా జరిమానా కూడా విధించే అవకాశాలుంటాయి.
ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రూ.110 కోట్లు విలువ చేసే 50 ఎకరాల స్థలాన్ని బినామీ పేర్లతో రిజిస్టర్ చేసిందని విచారణలో వెల్లడైనట్లు ఐటీ విభాగం పేర్కొంది. మరో కేసులో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇద్దరు అసెస్సీలు తమ ఉద్యోగులు, సంబంధీకులకు చెందిన ఖాతాల్లో దాదాపు రూ. 39 కోట్లు జమచేసినట్లు బయటపడిందని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment