Benami assets
-
శశికళకు షాక్.. బినామీ ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళకు చెందిన రూ. 1600 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖ మంగళవారం స్వాధీనం చేసుకుంది. 2016 నవంబర్‌లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న తరువాత చెన్నై, పుదుచ్చెరీల్లో వేర్వేరు చోట్ల ఉన్న 9 ఆస్తులను ఆమె కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు రూ. 1500 కోట్ల విలువైన రద్దైన నోట్లతో ఆ ఆస్తులను శశికళ బినామీ పేర్లతో కొన్నట్లు, నగదు చెల్లింపుల ద్వారానే ఆ కొనుగోలు జరిగినట్లు నిర్ధారించారు. అక్రమ ఆస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని జైళ్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2017లో ఐటీ అధికారులు శశికళతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై భారీగా దాడులు నిర్వహించారు. చెన్నై పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆ సమయంలోనే ఈ 9 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. -
రూ.380 కోట్ల శశికళ బినామీ ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ బంధువులకు చెందిన రూ.380 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ జప్తు చేసింది. దివంగత తమిళనాడు సీఎం జయలలిత, శశికళ బంధువులు, మిత్రులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఐటీ శాఖ పెద్దస్థాయిలో సోదాలు నిర్వహించడం తెల్సిందే. జయ, శశికళ పేర్లతో అనేక బినామీ సంస్థలు ఉన్నట్లు ఈ సోదాల్లో తేలింది. వీటిలోని చాలా సంస్థలకు చిరునామా.. చెన్నై టీనగర్‌లోని ఒకే అపార్టుమెంటు కావడం గమనార్హం. -
3,500 కోట్ల బినామీ ఆస్తులు జప్తు
న్యూఢిల్లీ: ఫ్లాట్లు, దుకాణాలు, ఆభరణాలు, వాహనాలతో కూడిన 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. వీటి విలువ రూ.3,500 కోట్ల పైగా ఉంటుందని తెలిపింది. 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బినామీ ఆస్తి లావాదేవీల నిరోధక చట్టం కింద మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ చట్టం కింద బినామీ ఆస్తులను (స్థిర, చరాస్తులు) ముందు తాత్కాలికంగా... ఆ తర్వాత పూర్తిగా జప్తు చేసే అధికారాలుంటాయి. అలాగే అనుచిత లబ్ధి పొందిన యజమాని, బినామీగా వ్యవహరించిన వారు, లావాదేవీలకు కారకులైన వారిపై న్యాయ విచారణ జరపవచ్చు. దోషులుగా తేలిన పక్షంలో ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ప్రాపర్టీ మార్కెట్ విలువలో 25 శాతం దాకా జరిమానా కూడా విధించే అవకాశాలుంటాయి. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రూ.110 కోట్లు విలువ చేసే 50 ఎకరాల స్థలాన్ని బినామీ పేర్లతో రిజిస్టర్ చేసిందని విచారణలో వెల్లడైనట్లు ఐటీ విభాగం పేర్కొంది. మరో కేసులో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇద్దరు అసెస్సీలు తమ ఉద్యోగులు, సంబంధీకులకు చెందిన ఖాతాల్లో దాదాపు రూ. 39 కోట్లు జమచేసినట్లు బయటపడిందని తెలియజేసింది. -
బినామీల భరతం పడతాం
సుందర్‌నగర్/కంగ్రా: అవినీతిపరుల భరతం పట్టేందుకు త్వరలోనే బినామీ చట్టం రానుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అక్రమాస్తులున్న కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికే దీనిపై గుబులురేగుతోందన్నారు. బినామీ ఆస్తులు కూడబెట్టుకున్న వారెవరినీ ఉపేక్షించబోమని మోదీ స్పష్టం చేశారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘నోట్లరద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం.. ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. బినామీ ఆస్తులపై త్వరలో విరుచుకుపడనున్న తుపాను కంటే ముందే నాకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు. పేదలనుంచి దోచుకున్నది వారికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నేతలు అవి వారి ఆస్తులే అని ప్రకటించుకోలేని పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 8న బ్లాక్‌డే నిర్వహించాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. కానీ ఇది అసలైన ‘బ్లాక్‌మనీడే’ అనే విషయం వారికి అర్థంకావటం లేదన్నారు. ‘కొవ్వొత్తుల ర్యాలీలు, కొందరిని వెనకేసుకుని వస్తే నేను భయపడను. సర్దార్ పటేల్ శిష్యుడిగా ఇలాంటి కుట్రలకు తలొగ్గేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు. ప్రజాధనం లూటీతో బినామీ ఆస్తులు ‘నేను కాంగ్రెస్ నేతలపై కొంత సమాచారం తీసుకుందామని ప్రయత్నించాను. కొందరు రద్దయిన పాతనోట్ల సంచులను పోగొట్టుకున్నారని తెలిసింది. ఈ సమయంలోనే మోదీ బినామీ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దీని ఫలితాలు కనబడితే తమ గతేంటనేదే వారి భయం. భూమి, ఫ్లాట్లు, దుకాణాలు, దాచిపెట్టుకున్న రూ.500, రూ. వెయ్యి నోట్లు ఇలా దేన్నీ వదిలిపెట్టను. ఈ విషయం అర్థమవటంతోనే ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమ డ్రైవర్లు, వంట మనుషులు, పని మనుషుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఇదంతా ప్రజలను లూటీ చేసిన డబ్బుతో కొన్నదని.. అది ప్రజల సంక్షేమానికే వినియోగించాలని మోదీ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసిన కాంగ్రెస్.. సిగ్గులేకుండా నవంబర్ 8ని బ్లాక్‌డేగా జరపాలనటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు మరో వందేళ్లైనా ప్రజలుఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓటమి గుర్తించే కాంగ్రెస్ పలాయనం అంతకుముందు, కంగ్రాలో జరిగిన ర్యాలీలోనూ కాంగ్రెస్ పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ దేశానికి పట్టిన చెద’ అని విమర్శించిన మోదీ.. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. హస్తం పార్టీ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. నోట్లరద్దు తర్వాత పేదలు, మధ్యతరగతి ప్రజలు తిరిగి పనులు చేసుకుంటుంటే.. అవినీతిపరులు మాత్రం తమ అక్రమ సంపాదనను బలవంతంగా బ్యాంకులో వేయించినందుకు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ సీఎంగా, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే హిమాచల్ ప్రదేశ్ పురోగతి సాధించిందన్న మోదీ.. నవంబర్ 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడొంతుల మెజారిటీ కల్పించాలని కోరారు. ‘నేను అవినీతిపై పోరాటం చేయాలా? వద్దా?. నిజాయితీగా ఉన్నవారికి భరోసా కలిగించాలా? వద్దా?. నేనీపని చేయటం పాపమవుతుందా?’ అని ప్రశ్నించారు. -
‘ఆ సమాచారం ఇస్తే రూ కోటి’
సాక్షి,న్యూఢిల్లీః బినామీ ఆస్తులపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చే వారికి రూ కోటి వరకూ నజరానాలిచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. నగదు రివార్డులకు సంబంధించి వచ్చే నెలలో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ అధికారి ఈ విషయం వెల్లడించారు. బినామీ ఆస్తులపై సమాచారం ఇచ్చే వారికి కనిష్టంగా రూ 15 లక్షల నుంచి గరిష్టంగా రూ కోటి వరకూ నగదు రివార్డ్ అందించనున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఈ నిబంధన లేకున్నా ఆదాయ పన్ను శాఖ, ఈడీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి దర్యాప్తు సంస్థలు రివార్డులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్నదేనని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫార్మర్ల సాయం తీసుకుంటే తమ పని మరింత సులువవుతుందని పన్ను అధికారులు భావిస్తున్న క్రమంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. -
అక్రమాస్తుల అన్వేషణలో ఏసీబీ
నల్లగొండ క్రైం : పట్టణంలో గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హల్చల్ సృష్టించారు. లెక్కలేనన్ని అక్రమాస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుపై నల్లగొండ-మహబూబ్‌నగర్ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటి కమిషనర్ నల్ల సాయికిషోర్‌ను గురువారం తెల్లవారుజామున పట్టణంలోని మీర్బాగ్ కాలనీలోని అద్దె ఇంట్లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సాయికుమార్ అక్రమాస్తుల కేసుపై అన్వేషణలో ఉన్న అధికారులు తెల్లవారుజామున ఒక్కసారిగా సాయికిషోర్ ఉంటున్న ఇంటిపై సోదాలను నిర్వహించారు. పలుడాక్యుమెంట్లను, విలువైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ముందు కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.60వేల నగదుతో పాటు ఇతర విలువైన పత్రాలను చేజిక్కించుకున్నారు. అక్రమాస్తులను లోతుగా తొవ్వి నిగ్గుతేల్చేందుకు ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. సాయికిషోర్ సొంత జిల్లా అయిన కృష్ణాజిల్లాలోని తిరుపురంలో కూడా సోదాలు జరిగాయి. హైదరాబాదులోని గచ్చిబౌలి, లోయర్‌ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రెండు ఇళ్లు, సొంత జిల్లాలో చాపల చెరువులు, బినామీ ఆస్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలో పనిచేసిన గుంతకల్లు, గుంటూరు, మలక్‌పేటలోని ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు కూపీ లాగుతున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటిలోని బ్యాలెన్స్‌లు తెలుసుకునేందుకు బ్యాంక్ అధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. బంధువుల పేరున బ్యాంక్ బినామీ ఆస్తులున్నాయన్న కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రాంతాల వారీగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. రాత్రి వరకు రూ. 3కోట్ల ఆస్తులున్నట్లు తెలుసుకుని దొరికిన ఆధారాల ప్రకారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని సాయికిషోర్ నివాసంలో విచారణ కొనసాగుతుందని ఏసీబీ సీఐ శ్రీనివాస్ తెలిపారు. విస్సన్నపేటలో.. విస్సన్నపేట: నల్లగొండ వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ నాళ్ల సాయికిషోర్‌కు సంబంధించి కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని అతని బంధువు అయిన జి.సత్యహనుమంతరావు ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. వ్యాపారి ఇంట సోదాలు తిరువూరు : కృష్ణా జిల్లా తిరువూరులో విత్తనాల వ్యాపారం చేసే నాళ్ల సాయిప్రసాద్ నివాసంలో గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులు సోదాలు చేశారు. ఆయన సోదరుడు నాళ్ల కిషోర్ నల్లగొండలో వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తూ ఏసీబీ వలలో చిక్కగా, ఆయన స్వగ్రామమైన తిరువూరులో కూడా విసృ్తత తనిఖీలు నిర్వహించారు. కిషోర్ సోదరుడు సాయిప్రసాద్, తండ్రి రంగారావులతో పాటు పలువురు బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ కుటుంబానికి చెందిన బ్యాంకు ఖాతాలు, వ్యాపార సంస్థల రికార్డులు, భూముల అమ్మకం, కొనుగోళ్ల లావాదేవీలను ఏసీబీ నల్లగొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాల సీఐలు లింగయ్య, వెంకటేశ్వరరావు, రామరాజు పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు తనిఖీ వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.