సుందర్‌నగర్/కంగ్రా: అవినీతిపరుల భరతం పట్టేందుకు త్వరలోనే బినామీ చట్టం రానుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. అక్రమాస్తులున్న కాంగ్రెస్ నేతల్లో ఇప్పటికే దీనిపై గుబులురేగుతోందన్నారు. బినామీ ఆస్తులు కూడబెట్టుకున్న వారెవరినీ ఉపేక్షించబోమని మోదీ స్పష్టం చేశారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన భారీ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘నోట్లరద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమం.. ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. బినామీ ఆస్తులపై త్వరలో విరుచుకుపడనున్న తుపాను కంటే ముందే నాకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు. పేదలనుంచి దోచుకున్నది వారికి తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ నేతలు అవి వారి ఆస్తులే అని ప్రకటించుకోలేని పరిస్థితిని సృష్టించాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. నవంబర్ 8న బ్లాక్‌డే నిర్వహించాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని.. కానీ ఇది అసలైన ‘బ్లాక్‌మనీడే’ అనే విషయం వారికి అర్థంకావటం లేదన్నారు. ‘కొవ్వొత్తుల ర్యాలీలు, కొందరిని వెనకేసుకుని వస్తే నేను భయపడను. సర్దార్ పటేల్ శిష్యుడిగా ఇలాంటి కుట్రలకు తలొగ్గేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు.
ప్రజాధనం లూటీతో బినామీ ఆస్తులు
‘నేను కాంగ్రెస్ నేతలపై కొంత సమాచారం తీసుకుందామని ప్రయత్నించాను. కొందరు రద్దయిన పాతనోట్ల సంచులను పోగొట్టుకున్నారని తెలిసింది. ఈ సమయంలోనే మోదీ బినామీ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దీని ఫలితాలు కనబడితే తమ గతేంటనేదే వారి భయం. భూమి, ఫ్లాట్లు, దుకాణాలు, దాచిపెట్టుకున్న రూ.500, రూ. వెయ్యి నోట్లు ఇలా దేన్నీ వదిలిపెట్టను. ఈ విషయం అర్థమవటంతోనే ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ప్రధాని తెలిపారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తమ డ్రైవర్లు, వంట మనుషులు, పని మనుషుల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. ఇదంతా ప్రజలను లూటీ చేసిన డబ్బుతో కొన్నదని.. అది ప్రజల సంక్షేమానికే వినియోగించాలని మోదీ పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసిన కాంగ్రెస్.. సిగ్గులేకుండా నవంబర్ 8ని బ్లాక్‌డేగా జరపాలనటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు మరో వందేళ్లైనా ప్రజలుఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఓటమి గుర్తించే కాంగ్రెస్ పలాయనం
అంతకుముందు, కంగ్రాలో జరిగిన ర్యాలీలోనూ కాంగ్రెస్ పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ దేశానికి పట్టిన చెద’ అని విమర్శించిన మోదీ.. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి.. హస్తం పార్టీ నేతలు పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. నోట్లరద్దు తర్వాత పేదలు, మధ్యతరగతి ప్రజలు తిరిగి పనులు చేసుకుంటుంటే.. అవినీతిపరులు మాత్రం తమ అక్రమ సంపాదనను బలవంతంగా బ్యాంకులో వేయించినందుకు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ సీఎంగా, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే హిమాచల్ ప్రదేశ్ పురోగతి సాధించిందన్న మోదీ.. నవంబర్ 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడొంతుల మెజారిటీ కల్పించాలని కోరారు. ‘నేను అవినీతిపై పోరాటం చేయాలా? వద్దా?. నిజాయితీగా ఉన్నవారికి భరోసా కలిగించాలా? వద్దా?. నేనీపని చేయటం పాపమవుతుందా?’ అని ప్రశ్నించారు.
బినామీల భరతం పడతాం
Published Sun, Nov 5 2017 1:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment