టికెట్ బుకింగ్: ఓ షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా , నగదు రహిత లావాదేవీలంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంటే.. రైల్వే టికెట్ బుకింగ్స్‌కు సంబంధించి ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను భారీగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు నగదు ద్వారానే టికెట్లు కొనుగోలు చేశారని అధ్యయనం వెల్లడించింది. దేశీయంగా రైలు టికెట్లలో కొనుగోళ్లలో యాభై శాతం లావాదేవీలు నగదు ద్వారా జరుగుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది.
వెబ్ ఆధారిత సంస్థ రైల్ యాత్రి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టికెట్ల బుకింగ్ విషయంలో డిజిటల్‌గా కంటే.. ఏజెంట్లపైనే ఎక్కువ ఆధారణపడుతున్నారని తెలిపింది. అందుకే నగదు కొనుగోళ్ళు భారీగా నమోదవుతున్నాయిని వివరించింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 50 వేల మంది ప్రయాణీకులు, 800మంది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ సర్వే నిర్వహించింది. 65 శాతంమంది ప్రయాణీకులు డిజిటల్ పేమెంట్స్‌పై మొగ్గుచూపుతున్నప్పటికీ 50 శాతం మంది నగదు చెల్లింపులు చేస్తున్నారని సర్వే చెప్పింది. భారతదేశంలో ముఖ్యమైన వినియోగదారుల విభాగం వారి అవసరాలు సంక్లిష్టం ఎక్కువగా ఉన్నప్పుడు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా సరఫరా-డిమాండ్ అసమానతలు, ఇతర అనిశ్చితుల కారణంగా డిజిటల్ టికెట్ బుకింగ్ ధోరణి క్షీణిస్తోందని రైల్ యాత్రి కో-ఫౌండర్, సీఈవో మనీష్ రాఠి వ్యాఖ్యానించారు.
గత ఐదు సంవత్సరాల్లో రైలు టికెట్ల 80 శాతానికిపైగా పెరిగితే, అనేక సంవత్సరాలుగా ట్రావెల్ ఏజెంట్ల కమిషన్ ఫీజు రూ. 20- 40 రూపాయలుగా ఉందని అధ్యయనం పేర్కొంది. దీంతోపాటు డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఈ అధ్యయనం సూచించింది.