నిలకడగా ‘పసిడి’
♦ వారంలో కేవలం ఒక డాలర్ పతనం
♦ అంతక్రితం 3 వారాల్లో 60 డాలర్లు తగ్గుదల!
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో మూడు వారాల పాటు దాదాపు 60 డాలర్లు పతనమైన పసిడి మే 13వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కేవలం ఒక డాలర్ తగ్గింది. ఔన్స్ (31.1గ్రా)కు 1,228 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఇది కన్సాలిడేషన్ సమయమని, కొనుగోళ్లకు అవకాశమని నిపుణులు చెబుతున్నారు. గడచిన వారం ఒక దశలో పసిడి కనిష్టంగా 1,216 డాలర్లకు పడిపోయినా, అక్కడి నుంచి 12 డాలర్లు పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై భరోసాలు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు సడలటం వంటి అంశాలు గడచిన నాలుగు రోజులుగా పసిడి తగ్గుదలకు కారణమయ్యాయి. అయితే అమెరికా అధ్యక్షుని డాలర్ ‘బలహీన’ లక్ష్యం విధానాలు పసిడిపై భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రభావితం చూపుతాయన్న అంచనాలూ ఉన్నాయి.
దేశీయంగానూ తగ్గుదల
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 13వ తేదీతో ముగిసిన వారంలో రూ.67 తగ్గి రూ.28,005కు చేరింది. అంతక్రితం వారంలో ఇక్కడ ధర దాదాపు రూ.801 పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.180 తగ్గి రూ.28,205కి చేరింది.