న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మరో కుంభకోణం తెరపైకి వచ్చింది. ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ సి.శివశంకరన్‌కు గ్రూపుతో సంబంధం కలిగిన విదేశీ కంపెనీలకు ఐడీబీఐ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం వల్ల రూ.600 కోట్ల నష్టం వాటిల్లిందంటూ సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ... ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ శివశంకరన్, అతని కుమారుడు శివశంకరన్ శరవణన్‌తోపాటు... 2010 నుంచి 2014 వరకు (రుణాలు మంజూరైన సమయంలో) ఐడీబీఐ బ్యాంకులో పనిచేసిన ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత ఉన్నతాధికారులు మొత్తం 15 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. వీరిలో ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో కిషోర్ ఖారత్ (ఐడీబీఐ బ్యాంకు రుణం మంజూరు సమయంలో ఆ బ్యాంకు ఎండీ, సీఈవోగా ఉన్నారు), సిండికేట్ బ్యాంకు ఎండీ మెల్విన్ రెగో (ఈయన గతంలో ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీగా పనిచేశారు), ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత చైర్మన్, ఎండీ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్, విదేశీ కంపెనీల నాటి డైరెక్టర్ల పేర్లు సహా 24 మంది ప్రైవేటు వ్యక్తుల పేర్లను సైతం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. మార్గదర్శకాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఐడీబీఐ బ్యాంకు రుణాలను జారీ చేసిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ తెలిపారు. దీనివల్ల బ్యాంకుకు, ప్రభుత్వ ఖజానాకు రూ.600 కోట్ల మేర నష్టం జరిగినట్టు పేర్కొన్నారు.
ఇవీ కేసులు...: 2010లో ఫిన్లాండ్‌కు చెందిన విన్ వైండ్ ఓవైకి (డబ్ల్యూడబ్ల్యూవో) ఐడీబీఐ బ్యాంకు రూ.322 కోట్ల రుణం మంజూరు చేసింది. మూడేళ్ల తర్వాత అది ఎన్‌పీఏగా మారింది. అలాగే, 2014 ఫిబ్రవరిలో బ్రిటిషన్ వర్జిన్ ఐలాండ్స్‌కు చెందిన ఆక్సెల్ సన్‌షైన్ లిమిటెడ్‌కు ఐడీబీఐ మరో రూ.523 కోట్ల రుణాన్నిచ్చింది. ఈ రుణాన్ని డబ్ల్యూడబ్ల్యూవో బకాయిలతోపాటు ఇతర అనుబంధ కంపెనీల రుణ బకాయిలను తీర్చేందుకు వినియోగించారన్నది సీబీఐ ఆరోపణ. రెండోసారి జారీ చేసిన రుణం కూడా ఎన్‌పీఏగా మారినట్టు సీబీఐ తెలిపింది. ఈ రెండూ శివశంకర్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని పేర్కొంది. కాగా, కేసు నమోదు తర్వాత నిందితుల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇవి జరిగాయి.
ఐడీబీఐ బ్యాంకులో 600 కోట్ల స్కామ్
Published Fri, Apr 27 2018 12:09 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment