న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.600 కోట్ల రుణ స్కామ్‌లో బ్యాంకు ప్రస్తుత, మాజీ అధికారుల నివాసాల్లో సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ కేసులో బీఎస్‌ఈ చైర్మన్ ఎస్.రవి పేరును తాజాగా చేర్చింది. ఈయన ఐడీబీఐ బ్యాంకు బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు, ఐడీబీఐ బ్యాంకు ఆడిట్ కమిటీ చైర్మన్‌గానూ ఉన్నట్టు బీఎస్‌ఈ వెబ్‌సైట్లో వివరాలు ఉన్నాయి.
ఇదే కేసులో ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో కిషోర్ కారత్, సిండికేట్ బ్యాంకు చీఫ్ మెల్విన్ రెగో, ఐడీబీఐ బ్యాంకు చైర్మన్, ఎండీ ఎస్‌ఎస్ రాఘవన్ సహా పలువురు ఐడీబీఐ బ్యాంకు అధికారులు, ఎయిర్‌సెల్ మాజీ ప్రమోటర్ శివశంకరన్, ఆయన కుమారుడు శరవణన్ పేర్లను ఇప్పటికే చేర్చిన విషయం విదితమే. క్రెడిట్ కమిటీ ఆఫ్ ద బ్యాంకు సీజీఎం అమిత్ నారాయణ్, బ్యాంకు క్రెడిట్ కమిటీ మాజీ సభ్యుడు ఆర్కే భన్సాల్, బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసన్ తదితరుల నివాసాల్లో సీబీఐ అధికారులు తాజాగా దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఎస్.రవితోపాటు ఇతరులను త్వరలోనే విచారించనున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment