వేతనాల పెంపుపై నేడే తుది నిర్ణయం
న్యూఢిల్లీ : లక్షలాది మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగుల రేయింబవళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఏడవ వేతన సంఘ సిఫారసులను ఎప్పటినుంచి అమలుచేస్తారో నేడు(సోమవారం) నిర్ణయం ప్రకటించనున్నారు. జూన్ 11న తీసుకోవాల్సిన చెల్లింపుల నిర్ణయం జూన్ 14కు వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తుది నిర్ణయం ప్రకటించడానికి కార్యదర్శుల సాధికారిక కమిటీ అధినేత కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశ అనంతరం 47 లక్షల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల వేతనం, 52లక్షల పెన్షనర్ల జీతాల పెంపుపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
ఏడవ వేతన సంఘం సిపారసులను విశ్లేషించడానికి స్క్రీనింగ్ కమిటీని కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఏర్పాటుచేసింది. ఈ ప్యానెల్ కు అధినేతగా కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాను కేంద్రప్రభుత్వం నియమించింది. వివరణాత్మకంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడవ వేతన సంఘ సిపారసులన ఈ కమిటీ విశ్లేషించింది. కార్యదర్శుల సాధికారిక కమిటీ ఏడవ వేతన సంఘ సిపారసులపై తుది నిర్ణయం ప్రకటిస్తే.. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ కొన్ని రోజుల్లోనే అమలుచేయనుంది. ఏడవ వేతన సంఘం ప్రకారం గరిష్ట జీతం రూ.2,50,000, కనిష్ట జీతం రూ.18,000గా ఉండనుంది.