సెక్షన్ 80సీకి 8 మార్గాలు.. | 8 ways to Section 80 C .. | Sakshi
Sakshi News home page

సెక్షన్ 80సీకి 8 మార్గాలు..

Published Mon, Jun 29 2015 12:54 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

సెక్షన్ 80సీకి 8 మార్గాలు.. - Sakshi

సెక్షన్ 80సీకి 8 మార్గాలు..

 ప్రజల్లో పొదుపు శక్తిని ప్రోత్సహించడానికి కేంద్రం అనేక పన్ను రాయితీలిస్తోంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలో 80సీ పేరుతో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. కానీ చాలామంది సెక్షన్ 80సీ అనగానే బీమా, పీపీఎఫ్, పీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ సెక్షన్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందేందుకు అనేక పథకాలున్నాయి. సెక్షన్ 80సీలో ఉండి అంతగా ప్రాచుర్యం లేని ఇన్వెస్ట్‌మెంట్ పథకాల గురించి ఈ వారం తెలుసుకుందాం. వీటిల్లో ఏ పథకాన్ని ఎంచుకున్నా.. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

 యులిప్
 ఇన్వెస్ట్‌మెంట్, బీమా, పన్ను ప్రయోజనాలను యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) అందిస్తుంది. చెల్లించిన ప్రీమియాన్ని వివిధ ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి వాటిలో వచ్చే లాభనష్టాలను అందిస్తాయి. కాబట్టి వీటి రాబడులపై ఎటువంటి హామీ ఉండదు. వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన ఐదేళ్ల వరకు వైదొలిగే అవకాశం లేదు. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగానే పరిగణించాలి. చిన్న వయస్సు ఉండి, రిస్క్ సామర్థ్యం ఉన్న వారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి.

 ఈఎల్‌ఎస్‌ఎస్
 ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం లేదా ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. వీటి రాబడులు కూడా ఈక్విటీ మార్కెట్స్‌పై ఆధారపడి ఉంటాయి. పన్ను ఆదాచేసే పథకాలన్నింటిలోకి తక్కువ లాకిన్ పీరియడ్‌ను కలిగివున్న పథకమిది. వీటి రాబడిపై ఎటువంటి పన్ను భారం ఉండకపోవడం, ఇన్వెస్ట్ చేసిన మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా వైదొలిగే అవకాశం ఉండటం ప్రధాన ఆకర్షణ. వీటి రాబడులు మార్కెట్ల ఒడిదుడుకులకు అనుగుణంగా మారతాయి. ఇవి దీర్ఘకాలిక దృష్టితో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైనవి. అధిక రాబడిని ఆశించే వారు, రిస్క్‌కు సిద్ధపడ్డవారు ఇన్వెస్ట్ చేయొచ్చు. డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే పన్ను భారం లేని ఆదాయాన్ని మధ్యమధ్యలో పొందే అవకాశం ఉంది?

 స్టాంప్ డ్యూటీ
 ఇంటిని కొనుగోలు చేసినప్పుడు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వ్యయాన్ని సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇంటిని కొన్న సంవత్సరంలో మాత్రమే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవాలి.

 ఇంటి రుణం
 రుణం తీసుకొని ఇంటిని నిర్మించిన వారికి రెండు సెక్షన్ల ద్వారా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. చెల్లిస్తున్న రుణంలో అసలుకు (అంటే వడ్డీ కాకుండా)చెల్లించే మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద ప్రయోజనం పొందవచ్చు. అదే రుణానికి చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బీ) కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
 
 సుకన్య సమృద్ధి..

 దీన్ని కేంద్రం ఈ మధ్యే ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి దీనికే ఉంది. దీని కాలపరిమితి అమ్మాయికి 21 ఏళ్లు లేదా వివాహ తేదీ ఏది ముందైతే అది. ఈ పథకంపై అందించే వడ్డీ ఏటా మారుతుంది. ఈ ఏడాది వడ్డీరేటును 9.2 శాతంగా ప్రకటించారు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఒక అమ్మాయిపై ఒక ఖాతా మాత్రమే ప్రారంభించగలరు. గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరిట ప్రారంభించొచ్చు. దగ్గర్లోని పోస్టాఫీసులో  ఈ పథకాన్ని ప్రారంభించొచ్చు.
 
 పెన్షన్ పథకాలు..

 పెన్షన్ నిధి కోసం ఇన్వెస్ట్ చేసే యాన్యుటీ ప్లాన్ కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. ఎల్‌ఐసీతో సహా అనేక బీమా కంపెనీలు ఈ పథకాలను అందిస్తున్నాయి.

 ఎన్‌ఎస్‌సీ, డిపాజిట్లు..
 పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, ఐదేళ్ల పోస్టాఫీసు, బ్యాంకు డిపాజిట్లు కూడా సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ ఆదాయం కావాలనుకునే వారికి ఇవి బాగుంటాయి. కానీ ఈ పథకాల వడ్డీపై పన్ను భారం ఉంటుంది. దీన్ని ప్రతి ఏటా ఆదాయంగా చూపించాల్సి ఉంటుంది.

 ట్యూషన్ ఫీజులు..
 పిల్లల చదువులకయ్యే వ్యయాలపై కూడా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇది మీరు చెల్లించే మొత్తం ఫీజులపై లభించదు. కేవలం అందులో పేర్కొన్న ట్యూషన్ ఫీజుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాని డొనేషన్స్, ల్యాబ్, డెవలప్‌మెంట్ ఫండ్ రూపంలో వసూలు చేసే ఫీజులకు ఇది వర్తించదు. నర్సరీ విద్య నుంచి విశ్వవిద్యాలయం కోర్సులకు వరకు ఇది వర్తిస్తుంది. కాని గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement