ముంబై: మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరిట బ్యాంకులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు ఊరటనిచ్చింది. కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనలను సడలించింది. సేవింగ్స్ ఖాతాలపై ఇప్పటిదాకా రూ. 5,000గా ఉన్న ఎంఏబీని రూ. 3,000కు తగ్గించింది. అలాగే బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పరిమాణాన్ని కూడా సవరించింది.
కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం .. పెన్షనర్లు, మైనర్లతో పాటు ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. ‘మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాలను ఒకే కేటగిరీ కింద లెక్కించాలని నిర్ణయించడం జరిగింది. దీనికి తగ్గట్లు మెట్రో నగరాల్లో ఎంఏబీ రూ. 3,000కు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్‌బీఐ పేర్కొంది.
50 శాతం దాకా జరిమానా తగ్గుదల..
మరోవైపు, ఎంఏబీ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాలను కూడా తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. దీన్ని 20–50% మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చార్జీలు రూ. 20–40 మధ్య, పట్టణ.. మెట్రో నగరాల్లో రూ. 30–50 మధ్య ఉంటాయని తెలిపింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ప్రధాన మంత్రి జన ధన ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలు వర్తించవు.
ఎస్‌బీఐలో మొత్తం 42 కోట్ల పొదుపు ఖాతాలు ఉండగా, ఈ కోవకి చెందిన ఖాతాలు 13 కోట్లు ఉన్నాయి. ‘పెన్షనర్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మైనర్ల ఖాతాలకు మినహాయింపు ఉంటుంది. తాజా సవరణలతో అదనంగా 5 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుంది‘ అని బ్యాంకు పేర్కొంది.
ఇప్పటిదాకా బాదుడు ఇదీ..
దాదాపు అయిదేళ్ల విరామం తర్వాత ఎస్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ కనీస నెలవారీ బ్యాలెన్స్, తత్సంబంధిత చార్జీలను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెట్రోపాలిటన్ నగరాల్లో ఎంఏబీ రూ. 5,000గాను, పట్టణాల్లో రూ. 3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2,000, గ్రామీణ శాఖల్లో రూ. 1,000 కనీస బ్యాలెన్స్‌గా నిర్ణయించింది. ఒకవేళ కనీస నెలవారీ బ్యాలెన్స్ నిర్దేశిత రూ. 5,000 కన్నా 75% తగ్గితే మెట్రో నగరాల్లో రూ. 100 (జీఎస్‌టీ అదనం) చార్జీలు విధిస్తోంది. అదే 50% లేదా అంతకన్నా తక్కువగా ఉంటే.. పెనాల్టీ రూ. 50 (జీఎస్‌టీ అదనం) విధిస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో జరిమానాలు రూ. 20–50 మధ్యలో (జీఎస్‌టీ అదనం) ఉంటున్నాయి.
సందేహాలు తీర్చే.. చాట్‌బోట్
ముంబై: ఖాతాదారుల సందేహాలు తీర్చేందుకు, సత్వర సేవలందించేందుకు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ’ఎస్‌బీఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ (ఎస్‌ఐఎ)’ పేరిట చాటింగ్ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ప్రతినిధి తరహాలోనే ఇది పూర్తి స్థాయి సేవలు అందిస్తుందని దీన్ని రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం సంస్థ పేజో తెలియజేసింది.
బ్యాంకింగ్ రంగంలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలదని పేజో వ్యవస్థాపక సీఈవో శ్రీనివాస్ నిజయ్ తెలిపారు. సెకనుకు 10,000 పైచిలుకు, రోజుకు 86.4 కోట్ల మేర ఎంక్వైరీలను ఈ చాట్‌బోట్ హ్యాండిల్ చేయగలదని ఆయన తెలియజేశారు. సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ సామర్ధ్యంలో ఇది 25 శాతం. ఈ చాట్‌బోట్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన సర్వీసులు అందించగలమని ఎస్‌బీఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శివ్ కుమార్ భాసిన్ చెప్పారు. ప్రస్తుతం ఇది బ్యాంకు ఉత్పత్తులు, సర్వీసులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది.