హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు షిర్డీకి విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. నూతనంగా ఏర్పాటైన షిర్డీ విమానాశ్రయాన్ని అక్టోబరు 1న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ నుంచి అక్టోబరు రెండో వారంలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ హైదరాబాద్–షిర్డీ మధ్య ఈ సర్వీసులు అందించనుంది. తొలుత రోజుకు ఒక ఫ్లైట్ నడుపుతుంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి సర్వీసుల సంఖ్య పెంచాలని ట్రూజెట్ భావిస్తోంది.
విజయవాడ నుంచి సైతం విమాన సేవలు ప్రారంభించేందుకు ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు నగరాల నుంచి టికెట్ ధర రూ.3,000–6,500 మధ్య ఉండొచ్చు. ఇక ముంబై నుంచి అలయన్స్ ఎయిర్ షిర్డీకి విమాన సర్వీసులు నడపనుంది. అక్టోబరు 1న సర్వీసు ప్రారంభం అయినప్పటికీ, అక్టోబరు 2 నుంచే వాణిజ్యపరంగా సేవలు మొదలవుతాయి. ఇండిగో సైతం కొత్త విమానాశ్రయంలో అడుగు పెట్టనుంది. మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) ఈ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసింది. మొత్తం రూ.350 కోట్ల వ్యయం కాగా, సాయి బాబా సంస్థాన్ రూ.50 కోట్లు సమకూర్చింది.