హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మునుపెన్నడూ లేనంతగా ఈ సారి పండుగల సీజన్‌లో ఈ–కామర్స్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఆఫ్‌లైన్ మార్కెట్ కూడా డిస్కౌంట్లలో నువ్వానేనా అంటోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విక్రేతలు ఆఫర్లు కురిపిస్తున్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం మాల్ వంటి ఈ–కామర్స్ సంస్థలకు దీటుగా బజాజ్ ఎలక్ట్రానిక్స్, టీఎంసీ, రిలయన్స్ డిజిటల్, బిగ్ సి, లాట్, సంగీత, ఐటీ మాల్, ఈజోన్, సోనోవిజన్, పై ఇంటర్నేషనల్ తదితర రిటైల్ చైన్లు కోట్లాది రూపాయల విలువైన బహుమతులు, భారీ డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి. రూపాయి చెల్లించి ఏ ఉత్పత్తినైనా తీసుకెళ్లొచ్చంటూ కస్టమర్లను ఊరిస్తున్నాయి. తయారీ కంపెనీలిచ్చే ఆఫర్లకు తోడు విక్రేతలూ బహుమతులందిస్తుండడం విశేషం.
పోటాపోటీగా బహుమతులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ రిటైల్ చైన్లు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తో పాటు దాదాపుగా ప్రధాన నగరాలన్నిటికీ విస్తరించాయి. పండుగల సీజన్ కోసం ఇవి అబ్బురపరిచే బహుమతులను ప్రకటిస్తున్నాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ రూ.కోటి క్యాష్ ప్రైజ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కిలో బంగారం, 10 ఆల్టో 800 సీసీ కార్లను అందిస్తోంది. హ్యాపీ ఫ్యామిలీ ఆఫర్‌తో టీఎంసీ ఆకర్షిస్తోంది.
ఇందులో భాగంగా కస్టమర్లు రూ.10 లక్షల నగదు, 25 కిలోల వెండి, ఒక కిలో బంగారం గెలుపొందొచ్చు. ప్రైస్ చాలెంజ్‌తో మెట్రో హోల్‌సేల్ సవాల్ విసురుతోంది. సోనీ నూతన శ్రేణి టెలివిజన్లపై విలువైన బహుమతులను అందుకోవ చ్చు. శామ్‌సంగ్, ఎల్‌జీ, లాయిడ్, డెల్, ప్యానాసోనిక్, హాయర్, వర్ల్‌పూల్ తదితర కంపెనీల కొత్త మోడళ్లతో ఔట్‌లెట్లు సందడిగా మారాయి.
‘స్మార్ట్’ ఆఫర్ల వెల్లువ..: మొబైల్ ఫోన్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ దసరావళి డబుల్ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. లక్కీడ్రాలో 36 హ్యుందాయ్ ఇయాన్ కార్లను బహుమతిగా గెల్చుకోవచ్చు. అక్టోబరు 21 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. లాట్ మొబైల్స్ అక్టోబరు 23 వరకు ఆఫర్లు అందిస్తోంది. లక్కీ డ్రాలో బీఎండబ్లు్య కారు, హోండా యాక్టివా స్కూటర్లు, ఏసీలు, టీవీల వంటి బహుమతులు గెలుపొందవచ్చు.
గతేడాది సీజన్‌తో పోలిస్తే 50% వృద్ధి ఆశిస్తున్నట్టు బిగ్ సి, లాట్ వెల్లడించాయి. మహా పండుగ, మహా సేల్ పేరుతో కార్లు, బంగారం, దుబాయ్ ట్రిప్ వంటి బహుమతులను సంగీత మొబైల్స్ అందిస్తోంది. ప్రతి ల్యాప్‌టాప్‌పై రూ.9,999 విలువ చేసే బహుమతులను ఇస్తున్నట్టు ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. కంపెనీ ఇచ్చే ఆఫర్ దీనికి అదనమని, డౌన్ పేమెంట్, వడ్డీ లేకుండా 12 ఈఎంఐలలో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయొచ్చని చెప్పారు.