జపాన్ పెట్టుబడుల కోసం కేంద్రం ప్రత్యేక టీమ్
న్యూఢిల్లీ: భారత్‌లో జపాన్ పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వీలుగా కేంద్ర పరిశ్రమల శాఖ ‘జపాన్ ప్లస్’ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు దేశాల ప్రభుత్వ అధికారులు ఉంటారని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటన సందర్భంగా భారత్‌లో వచ్చే ఐదేళ్లలో 33.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణ సహకారాన్ని అందించనున్నట్లు జపాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ టీమ్ ఈ నెల 8 నుంచే కార్యరూపంలోకి వచ్చిందని డీఐపీపీ తెలిపింది. జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన కెనిచిరో టోయోఫుకు దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బృందంలో ఇద్దరు జపాన్, నలుగురు భారతీయ అధికారులు ఉంటారని వెల్లడించింది. అదేవిధంగా కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఇండియా-జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ పార్ట్‌నర్‌షిప్ పేరుతో మరో కీలక బృందాన్ని కూడా భారత్ ఏర్పాటు చేసింది. వివిధ రంగాల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాల సమన్వయం, పర్యవేక్షణలను ఈ గ్రూప్ నిర్వహిస్తుందని డీఐపీపీ వివరించింది.