జపాన్ వైపు ఏపీ చూపు..
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సేద్య పద్ధతుల్లో సహకారం అవసరం
మూడో రోజు జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సేద్యపు విధానాల విషయంలో జపాన్ వైపు చూస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ అంశాల్లో సహకరించాలని కోరారు. జపాన్‌లోని ఫ్యుకోకా నగర ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లకు జపాన్ పెట్టుబడులు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. చంద్రబాబు జపాన్‌లో మూడో రోజు పర్యటన వివరాలను రాష్ర్ట ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మీడియాకు వెల్లడించింది.
ఆ వివరాల ప్రకారం.. చంద్రబాబు బృందం బుధవారం తొలుత ఫ్యుకోకా నగరంలోని ‘శాన్ నో స్టార్మ్’ రిజర్వాయర్‌ను సందర్శించింది. ఇక్కడ వరద నీటి నిర్వహణను చంద్రబాబు బృందం అధ్యయనం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో చర్చించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్యుకోకా వరద నీటి నియంత్రణ విధానాన్ని నూతన రాజధానితో పాటు 13 స్మార్ట్ నగరాల్లో అనుసరించడంపై అధ్యయనం చేస్తామన్నారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు స్మార్ట్ సిటీల అభివృద్ధికి జపాన్ సహకరించాలని కోరారు.ఐక్యరాజ్యసమితి గుర్తించిన 38 ఉత్తమ నగరాల్లో తమది ఒకటని ఫ్యుకోకా డిప్యూటీ మేయర్ అత్సుహికో సదకరి తెలిపారు. ఏపీ నూతన రాజధానిలో తమ విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంలో సహకరిస్తామని ఫ్యుకోకా పర్ఫెక్చర్ ఇంటర్నేషనల్ బ్యూరో డెరైక్టర్ అఖికో ఫ్యుకుషిమా తెలిపారు. అనంతరం చంద్రబాబు బృందం ఫ్యుకోకా టవర్‌ను సందర్శించింది.
నకాటా వ్యర్థ పదార్థాల
నిర్వహణ కేంద్రం పరిశీలన
అనంతరం ఫ్యుకోకాలోని నకాటా వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వ్యర్థాల నిర్వహణను స్థానిక అధికారులు వివరించారు. ఈ ఫ్యుకోకా మోడల్‌ను చైనా, ఇరాన్ తదితర దేశాల్లో అనుసరిస్తున్నట్లు వివరించారు.
కిటాక్యుషు స్మార్ట్ గ్రిడ్ సందర్శన
కిటాక్యుషు నగరంలోని విద్యుత్ స్మార్ట్ గ్రిడ్‌ను కూడా రాష్ట్ర బృందం సందర్శించింది. విద్యుత్ పొదుపు, 24 గంటల విద్యుత్ డిమాండ్‌ను ముందే అంచనా వేయటం, విద్యుత్ నిర్వహణ సమర్ధవంతంగా చేయటం, డిమాండ్ తగ్గితే వేరే గ్రిడ్లకు ఆ విద్యుత్‌ను మళ్లించటం, డిమాండ్ పెరిగితే వేరే గ్రిడ్ల నుంచి తీసుకోవడం వంటి వాటిని అధ్యయనం చేసింది. లో కార్బన్ సిటీగా పేరుపొందిన కిటాక్యుషు నగర మేయర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక్కడి గ్రీన్ సిటీ విధానం, పర్యావరణ పరిరక్షణ పద్ధతులపై చర్చించారు.చంద్రబాబు బృందం బుధవారం రాత్రికి జపాన్ రాజధాని నగరం టోక్యోకు చేరుకుంది.