
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై మరోసారి ఆందోళనలను చెరలేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ సమాచారం హ్యాకింగ్ నుంచి పూర్తిగా సురక్షితమని యుఐఎఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరోసారి స్పష్టం చేసింది. కేవలం రూ. 500కే పది నిముషాల్లో కోట్లాది మంది ఆధార్ వివరాలు బహిర్గతం అన్న వార్తలపై స్పందించిన యుఐఎఐ ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని కొట్టిపారేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆధార్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, దీని గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం సంబంధిత వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. పేటీఎం ద్వారా రూ.500 చెల్లిస్తే పది నిముషాల్లో ఆధార్ డేటా హ్యాకింగ్. ఓ రాకెట్ గ్రూప్ లోని ఏజెంట్ లాగిన్, ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారని, ఈ పోర్టల్ లో ఏ ఆధార్ నెంబరును నమోదు చేసినా ఈ సంస్థ వద్ద నమోదైన ఆ వ్యక్తి డీటైల్స్ అన్నీ అందుతాయని వార్తలు వచ్చాయి. వందల కోట్లకు పైగా భారతీయుల ఆధార్ వివరాలను ఐదు వందల రూపాయలకే అందజేయనున్నామంటూ వాట్సాప్ లో ఓ అజ్ఞాత గ్రూప్ విక్రయదారులు చెబుతున్నారని, ఇది తమ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైందని ” ది ట్రిబ్యూన్ ” పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆధార్ డేటా బయటికి పొక్కడం లేదా చోరీకి గురి కావడంవంటిదేదీ జరగడానికి ఆస్కారం లేదని ఈ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తుల డేటా పూర్తి సురక్షితంగా, భద్రంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment