సహారా యాంబీ వేలీ వేలం ప్రక్రియ షురూ
రిజర్వ్ ధర రూ. 37,000 కోట్లు
ముంబై: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సహారా గ్రూప్‌నకు చెందిన యాంబీ వేలీ రిసార్ట్ టౌన్ వేలం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. రిజర్వ్ ధర రూ. 37,392 కోట్లుగా నిర్ణయిస్తూ అధికారిక లిక్విడేటర్ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రాజెక్ట్ మార్కెట్ విలువ రూ. లక్ష కోట్ల పైగా ఉంటుందని సహారా గ్రూప్ పేర్కొంది.
బిడ్లను ఆహ్వానించడం, నో యువర్ క్లయింట్స్ మార్గదర్శకాలు ధృవీకరించుకునే రెండు ప్రక్రియలను మాత్రమే లిక్విడేటర్ ప్రారంభించారని తెలిపింది. తదుపరి విచారణ తేదీకి ముందే రూ. 1,500 కోట్లు డిపాజిట్ చేసిన పక్షంలో వేలం ప్రక్రియను ఉపసంహరిస్తారని సహారా వివరించింది. ఆధునిక విల్లాలు, గోల్ఫ్ కోర్స్, పాఠశాల, విమానాశ్రయం మొదలైన సదుపాయాలన్నీ ఉన్న అల్ట్రా ఎక్స్‌క్లూజివ్ నగరంగా ప్రకటనలో లిక్విడేటర్ పేర్కొన్నారు. పుణెలోని లోనావాలా దగ్గర దాదాపు 6,761.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ టౌన్‌షిప్ ఉంది.
మారిషస్‌కి చెందిన రాయల్ పార్ట్‌నర్స్ ఇన్వెస్ట్‌మెట్ ఫండ్ సుమారు 1.67 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 10,700 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామంటూ గతవారం ముందుకొచ్చినా.. వేలం ప్రక్రియ యథాప్రకారం ప్రారంభం కావడం గమనార్హం. వేలం పూర్తి కావడానికి ముందు అనేక దశలు ఉంటాయని సహారా గ్రూప్ తరఫు న్యాయవాది గౌతమ్ అవస్తి తెలిపారు.
యాంబీ వేలీ ప్రాజెక్టులోకి 1.67 బిలియన్ డాలర్లు సమకూర్చుకునే దిశగా ఆర్‌పీఐఎఫ్, విక్టర్ కోనిగ్ యూకేతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వివరించారు. ఇన్వెస్టర్లతో చర్చలు జరిపేందుకు అనుమతించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ తేదిలోగా రూ. 1,500 కోట్లు కడితే వేలం ప్రక్రియను ఉపసంహరిస్తామని పేర్కొంది. గ్రూప్ సంస్థలు అక్రమంగా సమీకరించిన నిధులను వాపస్ చేయాల్సిన కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.