
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ వేసవిలో భానుడి ప్రతాపానికితోడు ఎయిర్ కండీషనర్ల ధరలు సైతం వేడెక్కనున్నాయి. మోడల్‌నుబట్టి 5 నుంచి 10 శాతం దాకా విక్రయ ధర అధికం కానుంది. మార్చి 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఏసీల తయారీలో వాడే ప్రధాన విడిభాగాల వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. ఇవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. 2018 జనవరి 1 నుంచి అమలవుతున్న నూతన స్టార్ రేటింగ్ ప్రమాణాలతో ఏసీల ధరలు ఇప్పటికే 15 శాతం దాకా అధికమయ్యాయి.
విదేశాలపైనే ఆధారం..
ఏసీ తయారీలో కంప్రెసర్, కాపర్ పైప్, మోటారు ప్రధాన విడిభాగాలు. భారత్‌లో వీటి తయారీ జరగడం లేదు. వీటి కోసం ఇక్కడి కంపెనీలు విదేశాలపై ఆధారపడుతున్నాయి. మొత్తంగా ఒక్కో ఏసీలో 60–70 శాతం విడిభాగాలు దిగుమతి అవుతున్నవే. థాయ్‌లాండ్, తైవాన్, జపాన్, చైనా నుంచి ఇవి వస్తున్నాయి. స్పేర్‌పార్ట్స్ ధరలు పెరుగుతూ వస్తున్నాయని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో విక్రయ ధర మార్చి 1 నుంచి 5–10 శాతం అధికం కానుందని జనరల్ బ్రాండ్ ఏసీలను విక్రయిస్తున్న ఈటా జనరల్ సీఈవో ఎం.ఇజాజుద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
కొత్త రేటింగ్ విధానం..
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏసీలకు నూతన స్టార్ రేటింగ్ విధానం భారత్‌లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 5 స్టార్ ఏసీ కాస్తా 3 స్టార్ అయింది. తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసేలా అత్యంత నాణ్యమైన ఏసీలను కంపెనీలు తయారు చేయాల్సిందే. కొత్త స్టార్ రేటింగ్ అమలు కావడంతో ఇప్పటికే మోడళ్ల ధరలు 15 శాతం దాకా అధికమయ్యాయి. ఏసీలపై గతంలో వ్యాట్‌తోసహా ఇతర పన్నులు 25–26 శాతం ఉండేవి. ఇప్పుడు జీఎస్టీ 28 శాతం వసూలు చేస్తున్నారు.
ఇదీ ఏసీల విపణి..
భారత ఏసీ మార్కెట్లో 30 బ్రాండ్ల దాకా పోటీపడుతున్నాయి. 2017లో భారత్‌లో సుమారు 60 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. పరిశ్రమ 15–20 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. మార్కెట్‌లో 60–65 శాతం వాటా 3 స్టార్ ఏసీలదే. స్ప్లిట్ ఏసీలు 90 శాతం ఆక్రమించాయి.
మిగిలిన 10 శాతం విండో ఏసీలు ఉంటాయి. మొత్తం విపణిలో ఇన్వర్టర్ ఏసీలు 20 శాతం వాటా దక్కించుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ విభాగం 40–50 శాతానికి చేరడం ఖాయమని జనరల్ బ్రాండ్ అంటోంది. 5 స్టార్ ఏసీ సగటు ధర రూ.50–55 వేలుంది. ఇదే ధరలో ఇన్వర్టర్ మోడల్ రావడం కూడా వీటి అమ్మకాలు దూసుకెళ్లడానికి కారణం అవుతోంది.
భారత్‌లో తయారీ..
ఏటా 15–20% వృద్ధి నమోదు చేస్తున్న భారత ఏసీల మార్కెట్లో తయారీకి మరిన్ని విదేశీ కంపెనీలు ఉత్సాహం కనబరుస్తున్నాయి. హిటాచీ ఇటీవలే తయారీ ప్రారంభించింది. జీఎంసీసీ త్వరలో కార్యకలాపాలు సాగించనుంది. ఫుజిట్సు జనరల్, అకాయ్ సైతం ప్లాంటు ఏర్పాటుకు పూనుకుంటున్నాయి.
దైకిన్ మూడో ప్లాంటును దక్షిణాదిన నెలకొల్పేందుకు ప్రణాళిక చేస్తోంది. చైనా కంపెనీ మిడియా పుణేలో స్థాపిస్తున్న ప్లాంటు డిసెంబర్‌కల్లా సిద్ధం అవుతోంది. ఇక విక్రయ కంపెనీలు మెట్రోలను వీడి చిన్నపట్టణాలపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం 70% విక్రయాలు మెట్రోల్లో జరుగుతున్నా మార్కెట్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment