ఔషధ ముడి సరుకు దిగుమతులు ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
♦ గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సు ప్రారంభం
న్యూఢిల్లీ: ఔషధ ముడి సరకు (ఏపీఐ- యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్) దిగుమతులు భారీగా పెరిగిపోతుండడం పట్ల వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతులపై ఆధారపడని వ్యవస్థ దిశగా నడవడానికి నిపుణులు, ఫార్మా పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మనం ఫార్మా, బయోటెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినా ఏపీఐ దిగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల నాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
’’ అని ఇక్కడ జరిగిన గ్లోబల్ బయోటెక్నాలజీ సదస్సులో ఆమె పేర్కొన్నారు. జనరిక్ మందులకు కేంద్రంగా ఉంటూ... బయోటెక్నాలజీలో ఎంతో విజయం సాధించిన భారత్‌కు ఈ రంగంలో అపార అనుభవం ఉందన్నారు. ఇలాంటి దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు అధికమవరాదని అన్నారు. 2010-11లో 3 బిలియన్ డాలర్ల ఏపీఐ దిగుమతులు జరిగితే ఇందులో చైనా వాటానే 1.88 బిలియన్ డాలర్లు ఉండడం గమనార్హం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు చౌక ధరకు లభించే జనరిక్ మందులకు భారత్‌పై ఆధారపడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లలో ఫార్మా సంబంధ యూనిట్లకు అదనపు రాయితీలు ఇవ్వాలని రాష్ట్రాలను వాణిజ్యమంత్రిత్వశాఖ కోరుతున్నట్లు తెలిపారు. ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లోనే కాకుండా బయోటెక్నాలజీ విభాగంలో కూడా స్టార్టప్స్‌కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.
రానున్న ఐదేళ్లలో బయోటెక్నాలజీ రంగంలో 1,000 నుంచి 1,500 వరకూ స్టార్టప్స్ వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఐటీ రంగం విప్లవం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దంలో దేశంలో బయోటెక్నాలజీ విప్లవం రాబోతోందని అన్నారు. ఈ రంగం అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమ, ఎన్‌జీఓల సహకారం అవసరం అని పేర్కొన్నారు.