ప్యాకేజ్‌డ్ ఫుడ్‌పై అదాని దృష్టి...
♦ ఆహార వ్యాపారం వాటా 25% లక్ష్యం
♦ ప్రస్తుతం ఆదాయం రూ. 18,000 కోట్లు
♦ మరో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో రిఫైనరీలు
♦ అదాని విల్‌మర్ సీవోవో ఆంగ్‌షూ మల్లిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాండెడ్ వంటనూనెల విక్రయంలో మొదటి స్థానంలో ఉన్న అదాని విల్‌మర్ ఇప్పుడు ప్యాకేజ్‌డ్ ఫుడ్ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. బ్రాండెడ్ ఆహార పదార్థాల వినయోగం పెరుగుతుండటంతో ఈ రంగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు అదాని విల్‌మర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆంగ్‌షూ మల్లిక్ తెలిపారు. ‘ఫార్చూన్’ బ్రాండ్ పేరుతో బియ్యం, పప్పులు, పిండి, సోయా నగెట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం బాసుమతి బియ్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నామని, తెలుగు రాష్ర్ట ప్రజలకోసం త్వరలోనే సోనామసూరి, ఇతర రకాల బ్రాండెడ్ బియ్యాలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఆహార పదార్థాల విభాగం కేవలం 5 శాతంగా ఉందని, వచ్చే నాలుగేళ్లలో దీన్ని 25 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మల్లిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ఉత్పత్తుల సామర్థ్యం 2.5 లక్షల టన్నులుగా ఉందని, దీన్ని వచ్చే నాలుగేళ్లలో 10 లక్షల టన్నులకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం స్థానిక రైస్, ఫ్లోర్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం అదాని విలమర్ వ్యాపారం సుమారు రూ. 18,000 కోట్లు ఉండగా, ఇందులో రూ. 3,500 కోట్లు ఆహార విభాగం నుంచి వస్తుండగా, మిగిలినది వంటనూనెల నుంచి వస్తున్నట్లు తెలిపారు. దేశంలో బ్రాండెడ్ వంటనూనెల వ్యాపారం ఏటా సగటున 15 శాతం చొప్పున వృద్ధి చెందుతోందన్నారు. ఇదే విధంగా వచ్చే నాలుగేళ్లు వృద్ధి చెందితే తమ రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 30 లక్షల టన్నుల నుంచి 35 లక్షల టన్నులకు పెంచాల్సి వస్తుందన్నారు.
అదాని గ్రూపునకు కృష్ణపట్నం, మంత్రాలయంలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 22 సొంత రిఫైనరీలు, 24 లీజ్ ఆధారిత రిఫైనరీలను కలిగి వుంది. దేశవ్యాప్తంగా ఏటా 185 లక్షల టన్నుల వంట నూనెలు వినియోగిస్తుంటే ఇందులో బ్రాండెడ్ వాటా 55 శాతంగా ఉంది. అదానికి చెందిన ‘ఫార్చూన్’ బ్రాండ్ 19.5% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. దేశంలో సగటను ప్రతి మనిషి ఏటా 16 లీటర్ల వంట నూనెలను వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 24 లీటర్ల కంటే తక్కువగా ఉండటంతో ఈ రంగంలో విస్తరణకు అనేక అవకాశాలున్నట్లు మల్లిక్ వివరించారు.
పేటీఎంతో ఒప్పందం: తెలుగు రాష్ట్రాల్లో ‘ఫార్చూన్’ బ్రాండ్‌ను విస్తరణకు అదాని విల్‌మర్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్‌తో పాటు, బంగారం, కార్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎం ద్వారా నగదు చెల్లించిన వారికి లీటరుకు రూ. 30, 5 లీటర్లకు రూ. 100 క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 15 వరకు అమల్లో ఉంటుంది.