అదానీ పవర్‌ డీలిస్ట్‌? | Adani Power may delists | Sakshi
Sakshi News home page

అదానీ పవర్‌ డీలిస్ట్‌?

Published Sat, May 30 2020 3:12 PM | Last Updated on Sat, May 30 2020 3:12 PM

Adani Power may delists - Sakshi

బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌లోని విద్యుత్‌ రంగ కంపెనీ అదానీ పవర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా కంపెనీ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) మార్గాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనపై తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశాయి. బైబ్యాక్‌ ద్వారా కంపెనీలో మిగిలిన వాటాను కొనుగోలు చేసే వ్యూహంలో ప్రమోటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో దిగ్గజ పారిశ్రామికవేత్త అనిల్‌ అగర్వాల్‌ సైతం గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ వేదాంతా లిమిటెడ్‌ను డీలిస్ట్‌ చేసే ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. ఈ బాటలో గౌతమ్‌ అదానీ సైతం అదానీ పవర్‌ డీలిస్టింగ్‌ సన్నాహాలు చేపడుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా
ఆరు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల ద్వారా అదానీ పవర్‌ 12,410 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. కంపెనీలో ఇప్పటికే దాదాపు 75 శాతం వాటా ప్రమోటర్ల చేతిలో ఉంది. బైబ్యాక్‌ చేపట్టడం ద్వారా మిగిలిన 25.1 శాతం వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. శుక్రవారం అదానీ పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం లాభపడి రూ. 36.3 వద్ద ముగిసింది. గతేడాది నవంబర్‌లో ఈ షేరు రూ. 74 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది.

వ్యూహాత్మకం
స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలపై అధిక దృష్టిని సారించేందుకు వీలుంటుందని అదానీ పవర్‌ భావిస్తోంది. తద్వారా కంపెనీపై యాజమాన్యానికి పూర్తిపట్లు లభిస్తుందని చెబుతోంది. దీంతో నిర్వహణ, వ్యూహాలు, ఆర్థిక అంశాలలో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణ, కొత్త అవకాశాల అన్వేషణ, విస్తరణ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. వెరసి కొత్త బిజినెస్‌లు, ప్రాంతాలలో కార్యకలాపాల విస్తరణ కోసమే డీలిస్టింగ్‌ యోచన చేపట్టినట్లు వివరించింది. వాటాదారులకు ప్రయోజనం చేకూరేలా డీలిస్టింగ్‌ ప్రతిపాదనను చేపట్టనున్నట్లు అదానీ పవర్‌ చెబుతోంది. తద్వారా కంపెనీ నుంచి బయటపడేందుకు లాభసాటి మార్గాన్ని చూపనున్నట్లు తెలియజేసింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా డీలిస్టింగ్‌ ధరను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement