భారత్ వృద్ధి అంచనాలకు ఏడీబీ కోత
- 7.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గింపు
- పార్లమెంట్‌లో సంస్కరణల బిల్లులు ముందుకు వెళ్లడం లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.8 శాతాన్ని 7.4 శాతానికి తగ్గించినట్లు ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. 2016-17లో వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనా 8.2 శాతం. ప్రైవేటు వినియోగం, తయారీ, సేవల రంగాలు అన్నీ నెమ్మదిస్తాయని తెలిపింది. వృద్ధి క్యూ1లో 7 శాతానికి పరిమయిన నేపథ్యంలో పలు సంస్థలు భారత్ వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నాయి.
మూడు ప్రధాన కారణాలు...
వృద్ధి రేటు కోతకు సంబంధించి మూడు కారణాలను ప్రధానంగా నివేదిక తెలిపింది. ‘అందులో ఒకటి వర్షాభావ పరిస్థితులు. మరొకటి అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం. ఇక మూడవది పార్లమెంటులో సంస్కరణల బండిని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి.’ అని అవుట్‌లుక్ వివరించింది. దేశీయ పన్నుల వ్యవస్థ, భూ సేకరణ, కార్మిక చట్టాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. వినియోగ ధరల సూచీ అధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఒకవేళ 4 శాతానికి కొంత అటుఇటుగా ఉన్నా... ఇది అనిశ్చితి పరిస్థితేనని పేర్కొంది. ఈ అంశం ప్రధానంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలపై ఆధారపడి ఉందని పేర్కొంది. ఒకవేళ క్రూడ్ ధరలు పెరిగితే ప్రతికూలతలు తీవ్రమయ్యే అవకాశం ఉందని వివరించింది. కాగా గత త్రైమాసికంలో స్థిర పెట్టుబడుల వృద్ధి 4.1 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఎగుమతుల క్షీణ ధోరణి కొనసాగవచ్చని అంచనావేసింది.
ఆసియా ప్రాంతం వృద్ధీ డౌన్...
భారత్, చైనాల్లో వృద్ధి నెమ్మదించిన ప్రభావం ఆసియా ప్రాంతం మొత్తంపై ప్రభావం చూపుతుందని నివేదిక పేర్కొంది. 2015, 16ల్లో ఈ ప్రాంతం వృద్ధి రేటును 6.3 శాతం (రెండేళ్లలోనూ) నుంచి కిందకు కుదించింది. 2015లో 6 శాతం, 2016లో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని తాజా విశ్లేషణలో పేర్కొంది.