నోట్ల రద్దు తర్వాత బంగారానికి మరో దెబ్బ
నోట్ల రద్దు తర్వాత బంగారానికి మరో దెబ్బ
Published Sat, Jul 29 2017 12:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM
పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను కేంద్రప్రభుత్వం నవంబర్ 8న అకస్మాత్తుగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో రాత్రికి రాత్రి భారీగా పెరిగిన బంగారం అమ్మకాలు, ఆ తర్వాత తీసుకొచ్చిన కఠినతరమైన నిబంధనలు, చర్యలతో కుప్పకూలాయి. జువెల్లరీ సెక్టార్ కోలుకోలేని దెబ్బతిన్నది. ప్రస్తుతం జీఎస్టీతో మరోసారి జువెల్లరీ సెక్టార్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేవలం పన్ను రేట్లతోనే కాక, గూడ్స్ తరలింపు ప్రక్రియలో విధానపరమైన సమస్యలను జువెల్లరీ సెక్టార్ ఎదుర్కొంటుందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం, రూ.50వేల కంటే ఎక్కువ విలువ ఉన్న కమోడిటీని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ట్రేడర్ కచ్చితంగా ఈ-వే బిల్‌ను జనరేట్ చేయాల్సి ఉటుంది. అయితే బంగారం విషయంలో ఇది క్లిష్టంగా మారుతోంది.
బంగారం ఎక్కువ విలువ ఉన్న కమోడిటీ. దీన్ని పలు ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ప్రతిసారి ఈ-వే బిల్లు ప్రొసీజర్‌ను నమోదుచేయడం కష్టమని జువెల్లరీ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఈ-వే బిల్లు నిబంధన జువెల్లరీ రంగంలో చాలా సమస్యలను తెస్తుందని చెప్పారు. తమ ఆందోళనలను ప్రభుత్వం ముందు ఉంచామని, త్వరలో ఈ నిబంధనలను మార్చుతారని ఆశిస్తున్నట్టు ఆల్-ఇండియా జెమ్స్ అండ్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నితిన్ ఖండేల్‌వాల్ చెప్పారు. ఈ-వే బిల్లు ప్రొసీజర్ పరిమితిని బంగారానికి కనీసం రూ.1.5 కోట్లకు పెంచాలని జువెల్లరీ సెక్టార్ డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 5న నిర్వహించబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జువెల్లరీ డిమాండ్‌ను చర్చిస్తామని వాణిజ్య పన్నుల కమిషనర్ రిట్విక్ రంజనమ్ పాండే చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఏర్పడటంతో బంగారం అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇవి కోలుకుంటున్నాయని జువెల్లరీ వర్గాలు చెప్పాయి. మరో ఏడాది పాటు ఈ రికవరీ పట్టవచ్చన్నారు.
ఈ-వే బిల్లు అంటే..
అంతరాష్ట్రాలు, రాష్ట్రంలోనూ కమోడిటీని గమ్యస్థానానికి తరలించే ముందు దాని విలువను, పరిమాణాన్ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. రూ.50వేల కంటే ఎక్కువ విలువున్న ఉత్పత్తులకు ఈ-వే బిల్లు అవసరం. గమ్యస్థానం 100 కిలోమీటర్ల లోపు ఉంటే, ఈ-వే బిల్లుకు గడువు రెండు రోజుల్లో కాలం చెల్లుతుంది. కిలోమీటర్ల బట్టి ఈ బిల్లుకు వాలిడిటీ కాలాన్ని నిర్థారించారు.
Advertisement